లక్షన్నర కోట్లు దోచేశారు!
ABN , First Publish Date - 2023-04-26T03:11:40+05:30 IST
కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు రూ.లక్షన్నర కోట్లు దోచేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నిప్పులు చెరిగారు.
కమీషన్‌తో రాష్ట్రాన్ని గుల్ల చేశారు..
బీజేపీ ప్రభుత్వంపై ప్రియాంక ఫైర్
‘నవ కర్ణాటక’ నిర్మాణమే లక్ష్యమని వెల్లడి
బెంగళూరు, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు రూ.లక్షన్నర కోట్లు దోచేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నిప్పులు చెరిగారు. 40ు కమీషన్‌తో రాష్ట్రాన్ని గుల్ల చేశారని, ఏమాత్రం సిగ్గు లేకుండా ప్రజాధనం దోచుకున్నారని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం మైసూరులో పర్యటించిన ఆమె పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మైసూరు జిల్లా టి.నరసిపురలో ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. కర్ణాటక అంటే తమ కుటుంబానికి ఎంతో అభిమానమని అన్నారు. కన్నడిగులను.. స్నేహశీలురు, కష్టజీవులు, శాంతిప్రియులు అని కొనియాడారు. నాలుగేళ్ల కిందట ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచి, బీజేపీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని అన్నారు. ప్రజలంతా 40ు కమీషన్ గురించే మాట్లాడుకుంటున్నారని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి ఇంట్లో ఏకంగా రూ.8 కోట్లు పట్టుబడినా ఆయనపై చర్యలు తీసుకోలేదని విమర్శించారు. బీజేపీ నేతలపై రూ.కోట్ల అక్రమాలకు సంబంధించి ఆరోపణలున్నా ప్రధాని పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. కన్నడిగుల ఆత్మగౌరవానికి సంకేతంగా ఉన్న కన్నడ పతాకాన్ని అధికారికంగా గుర్తించలేదన్నారు. నందిని పాల అంశాన్ని ప్రస్తావిస్తూ, రాష్ట్ర పాడిరైతుల ప్రయోజనాలను సైతం దెబ్బతీసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అన్నభాగ్య, క్షీరభాగ్య వంటి ఎన్నో సంక్షేమాలు అమలు చేసిందని, బీజేపీ అధికారంలోకి వస్తూనే ఉచిత బియ్యానికీ కోత పెట్టిందని ప్రియాంక విరుచుకుపడ్డారు. అన్ని వర్గాలకు న్యాయం చేకూరుస్తూ శాంతియుత, నవ కర్ణాటక నిర్మాణమే కాంగ్రెస్ లక్ష్యమని చెప్పారు. కాగా, ప్రియాంకను చూసేందుకు కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ప్రతిపక్షాలు తనకు సమాధి తవ్వుతున్నాయంటూ ప్రధాని మోదీ ఎవరిని మఽభ్య పెడుతున్నారని ప్రియాంక నిలదీశారు.
రైతుకు రూ.27, అదానీకి 1600 కోట్లు!
దేశంలో సాధారణ రైతు సగటున రోజుకు రూ.27 సంపాయిస్తున్నాడని ప్రియాంక తెలిపారు. అయితే, అదేసమయంలో ప్రధాని మోదీ వ్యాపార మిత్రుడు.. అదానీ మాత్రం రోజుకు రూ.1600 కోట్లు సంపాయిస్తున్నారని పేర్కొన్నారు. దీనికి కారణం యువతకు ఉపాధి కల్పించే ప్రభుత్వ రంగ సంస్థలను అదానీకి మోదీ కట్టబెట్టడమేనని దుయ్యబట్టారు.
ముస్లింల ఓట్లు మాకొద్దు బీజేపీ నేత ఈశ్వరప్ప వ్యాఖ్య
‘‘ముస్లింలు దేశ ద్రోహులు వారి ఓట్లు మాకు వద్దే వద్దు. వారు ఓటు వేయకపోయినా విజయం మాదే’’ అని కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శివమొగ్గలో మంగళవారం మాజీ సీఎం యడియూరప్పతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బెంగళూరు సిటీ నియోజకవర్గంలో 55 వేలకు పైగా ముస్లిం ఓట్లు ఉన్నాయని, వీటిలో ఒక్క ఓటు తమకు పడకపోయినా బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే, పక్కనే ఉన్న యడియూరప్ప ఏమాత్రం చలించకపోగా, ఈశ్వరప్పను వారించే ప్రయత్నమూ చేయలేదు.
మే 9 వరకు ‘రద్దు’ చేయొద్దు!
కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్లపై సుప్రీం
కర్ణాటకలో ముస్లింల రిజర్వేషన్ రద్దు నిర్ణయాన్ని మే 9వ తేదీ వరకు అమలు చేయొద్దని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై అఫిడవిట్ వేసేందుకు రాష్ట్ర సర్కారు సమయం కోరడంతో సుప్రీం ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మే 9 వరకు ముస్లింలకు యథాతథంగా 4ు రిజర్వేషన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. కాగా, రిజర్వేషన్ల రద్దుపై సుప్రీం తుది తీర్పు వచ్చేవరకు వేచి చూస్తామని సీఎం బొమ్మై పేర్కొన్నారు. ఽ