Share News

Karnataka Advisory: కొవిడ్ వేరియంట్‌పై కర్ణాటక అడ్వైజరీ.. రాష్ట్ర సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు

ABN , Publish Date - Dec 19 , 2023 | 03:36 PM

దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతుండటం, కేరళలో జేఎన్.1 అనే కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో.. కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఒక అడ్వైజరీ జారీ చేసింది. 60 ఏళ్లు పైబడిన వారు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు...

Karnataka Advisory: కొవిడ్ వేరియంట్‌పై కర్ణాటక అడ్వైజరీ.. రాష్ట్ర సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు

Karnataka Issues Advisory On Covid Variant: దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతుండటం, కేరళలో జేఎన్.1 అనే కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో.. కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఒక అడ్వైజరీ జారీ చేసింది. 60 ఏళ్లు పైబడిన వారు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు బహిరంగ ప్రదేశాల్లో తప్పకుండా మాస్క్‌లు ధరించాలని.. అలాగే రద్దీగా ఉండే ప్రాంతాలను నివారించాలని ఆదేశించింది. ‘‘వృద్ధులందరూ (60 ఏళ్లు పైబడిన వారు), కొమొర్బిడ్ (మూత్రపిండాలు, గుండె, కాలేయ వ్యాధులతో బాధపడుతున్నవారు), గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు బహిరంగ ప్రదేశాల్లో తప్పకుండా ఫేస్ మాస్క్‌లు ధరించాలి. పూర్ వెంటిలేషన్, రద్దీగా ఉండే ప్రాంతాల్ని సందర్శించకూడదు’’ అని హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ సర్వీసెస్ కమిషనర్ డీ. రణదీప్ అడ్వైజరీ జారీ చేశారు.


జ్వరం, దగ్గు, జలుబు, ముక్కు కారటం వంటి శ్వాసకోశ లక్షణాలున్న వారందరూ.. వెంటనే వైద్యులను సంప్రదించాలని కర్ణాటక ప్రభుత్వం కోరింది. ఈ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఫేస్ మాస్క్ ధరించాల్సిందేనని.. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువగా సందర్శించొద్దని పేర్కొంది. తరచుగా చేతులు కడుక్కోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత నిర్వహణ అవసరమని తెలిపింది. అనారోగ్యంగా ఉన్న వాళ్లందరూ ఇంట్లోనే ఉండాలని.. ఇతర వ్యక్తులతో ముఖ్యంగా వృద్ధులతో దూరం పాటించాలని తెలిపింది. విదేశాలకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని.. విమానాశ్రయంలో, అలాగే విమానం లోపల మాస్కులు ధరించడం మర్చిపోవద్దని సూచించింది. అటు.. కేరళలో కొవిడ్ కేసులు పెరుగుతండటంతో పాటు జేఎన్.1 సబ్-వేరియంట్ గుర్తించబడటంతో కర్ణాటకలో కొన్ని నివారణ, క్రియాశీల చర్యలను పాటించాల్సిన అవసరం ఉందని ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుతం భయపడాల్సిన అవసరం లేదని.. అయితే కేరళ, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో పరిస్థితిని సమీక్షించడం జరుగుతోందని.. ఆ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందని కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. కేరళ, తమిళనాడు వరకు ఉన్న అన్ని సరిహద్దు జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని.. తగిన పరీక్షలు నిర్వహించి, కొవిడ్ కేసుల్ని సకాలంలో నివేదించేలా చూసుకోవాలని సూచించింది. వైద్య కళాశాలలతో పాటు ప్రైవేట్, ప్రభుత్వ తృతీయ కేంద్రాల్లో ఇన్‌ఫ్లుయెంజా సహా అక్యూట్ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్ (SARI), COVID 19 కేసులను స్వీకరించాలని ఆ సర్క్యులర్ వెల్లడించింది.

Updated Date - Dec 19 , 2023 | 03:36 PM