Karnataka: కర్ణాటకలో ముదిరిన భాషా వివాదం.. రెచ్చిపోయిన కన్నడ గ్రూప్
ABN , Publish Date - Dec 27 , 2023 | 07:24 PM
కర్ణాటకలో భాషా వివాదం మరింత ముదిరింది. దుకాణాదారులు, ఇతర వ్యాపారులు తమ సైన్ బోర్డులలో 60 శాతం వరకూ కన్నడ భాషనే వినియోగించాలన్న ఆదేశాలు వచ్చిన తర్వాత ‘‘కర్ణాటక రక్షణ వేదికే’’ (కేఆర్‌వీ) అనే మితవాత గ్రూపు సభ్యులు..
Kannada Language Row: కర్ణాటకలో భాషా వివాదం మరింత ముదిరింది. దుకాణాదారులు, ఇతర వ్యాపారులు తమ సైన్ బోర్డులలో 60 శాతం వరకూ కన్నడ భాషనే వినియోగించాలన్న ఆదేశాలు వచ్చిన తర్వాత ‘‘కర్ణాటక రక్షణ వేదికే’’ (కేఆర్‌వీ) అనే మితవాత గ్రూపు సభ్యులు రెచ్చిపోయారు. బుధవారం రాష్ట్ర రాజధాని బెంగళూరులో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, హై-ప్రొఫైల్ బిజినెస్, షాపింగ్ మాల్స్‌పై విరుచుకుపడ్డారు. ఆంగ్ల భాషలో ఉన్న సైన్ బోర్డులను ధ్వంసం చేశారు. కర్ణాటక అధికార భాష అయిన కన్నడను ఆంగ్లంలో ఉన్న సైన్ బోర్డులు అణగదొక్కుతున్నాయని వాదనలు చేస్తూ.. హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. కేఆర్‌వీ కన్వీనర్ టీఏ నారాయణ గౌడతో పాటు పలువురు నిరసనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు.
‘‘నిబంధన ప్రకారం.. సైన్ బోర్డులు, నేమ్‌ప్లేట్లపై 60 శాతం కన్నడలోనే ఉండాలి. మేము వ్యాపారాలకు వ్యతిరేకమేమీ కాదు. కానీ మీరు కర్ణాటకలో వ్యాపారం చేస్తున్నప్పుడు.. మీరు మా భాషను గౌరవించాలి. మీరు సైన్ బోర్డుల్లో కన్నడ భాషను విస్మరించినా లేదా కన్నడ అక్షరాలను చిన్నగా రాసినా.. మేము మిమ్మల్ని ఇక్కడ ఆపరేట్ చేయనివ్వం’’ అని టీఏ నారాయణ గౌడ మీడియాతో చెప్పారు. మరోవైపు.. సైన్ బోర్డ్స్, నేమ్‌ప్లేట్స్‌పై 60 శాతం కన్నడ భాష ఉండాలని ఆదేశాలు వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కరూ దానిని వెంటనే అమలు చేయాలని కేఆర్‌వీ డిమాండ్ చేస్తోంది. వీలైనంత త్వరగా ఆంగ్లంలో ఉన్న సైన్ బోర్డులను కన్నడ భాషలో మార్చాలని కోరుతోంది. ఈ నేపథ్యంలోనే బృందంతో కలిసి సమావేశం ఏర్పాటు చేసింది. అటు.. కేఆర్‌వీ గ్రూప్ సభ్యులు నగరంలో చేసిన రాద్ధాంతానికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆంగ్లంలో ఉన్న సంకేతాల్ని వీళ్లు నాశనం చేయడాన్ని ఆ వీడియోల్లో చూడొచ్చు.
మరోవైపు.. పౌరసరఫరాల పరిధిలోని వాణిజ్య దుకాణాలు 60% తప్పకుండా కన్నడ భాషలో రాయాలన్న ఆదేశాలను పాటించేందుకు ఫిబ్రవరి 28వ తేదీ వరకు గడవు ఉందని బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) చీఫ్ తుషార్ గిరినాథ్ తెలిపారు. ఆ గడువు లోపు ఆదేశాలను పాటించకపోతే.. వ్యాపార లైసెన్స్‌లను సస్పెండ్ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు అక్టోబర్‌లో.. కర్ణాటకలో నివసించే ప్రతి ఒక్కరూ కన్నడ మాట్లాడటం నేర్చుకోవాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు. అప్పటి నుంచి ఈ భాషా వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. తన మునుపటి పదవీకాలంలోనూ స్థానిక భాష విస్తృత ఉపయోగం కోసం ముందుకొచ్చినప్పుడు.. బెంగళూరు మెట్రో స్టేషన్లలోని హిందీ పేర్లను లక్ష్యంగా చేసుకుని టేప్‌తో కప్పేయడం జరిగింది.