Khalistani Arshdeep Dalla: వెలుగులోకి వచ్చిన మరో ఖలిస్థానీ ఉగ్రవాది చీకటి కోణం.. సీన్‌లోకి పాకిస్తాన్ ఎంట్రీ!!
ABN , First Publish Date - 2023-09-25T19:29:00+05:30 IST
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్, కెనడా మధ్య దౌత్య వివాదం నెలకొన్న తర్వాత.. ఖలిస్థానీ ఉగ్రవాదుల చీకటి రహస్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే హర్దీప్ సింగ్ మన దేశంలో..
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్, కెనడా మధ్య దౌత్య వివాదం నెలకొన్న తర్వాత.. ఖలిస్థానీ ఉగ్రవాదుల చీకటి రహస్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే హర్దీప్ సింగ్ మన దేశంలో, ముఖ్యంగా పంజాబ్‌లో ఎన్నో దాడులు చేసినట్లు వెల్లడైంది. మరో ఖలిస్థానీ ఉగ్రవాది అయిన గురుపత్వంత్ సింగ్ పన్నున్ సైతం భారత్‌ని ముక్కలు చేసి, కొన్ని దేశాలు ఏర్పాటు చేయాలని భారీ కుట్ర పన్నినట్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) నివేదిక పేర్కొంది. ఇతనిపై 16 కేసులు కూడా ఉన్నట్టు తేలింది. ఇప్పుడు తాజాగా కెనడాకు చెందిన ఖలిస్థానీ ఉగ్రవాది అర్ష్‌దీప్ దల్లా గురించి షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇతనికి పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్నాయని, పంజాబ్‌లోని హిందూ నేతలను అతడు టార్గెట్ చేయాలనుకున్నాడని ఢిల్లీ పోలీసులు కనుగొన్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ పోలీసులు ఇద్దరు ఉగ్రవాద అనుమానితులైన జగ్జీత్ సింగ్ జగ్గా, నౌషాద్‌లను అరెస్ట్ చేశారు. వీరిపై కఠినమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టం కింద అభియోగాలు మోపారు. వీరిద్దరిని తమదైన శైలిలో పోలీసులు విచారించగా.. అర్ష్‌దీప్ దల్లాతో తాము టచ్‌లోనే ఉన్నామని వాళ్లు తెలిపారు. అంతేకాదు.. పంజాబ్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు సిద్ధం కావాలని అతడు తనకు ఆదేశాలు జారీ చేశాడని కూడా జగ్గా పేర్కొన్నాడు. ఇతని వాంగ్మూలాన్ని ఢిల్లీ పోలీసులు రెండు నెలల క్రితం కోర్టులో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో పొందుపరిచారు. హిందూ సంస్థలతో పాటు బీజేపీ సైద్ధాంతిక విభాగం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) నాయకులను కూడా అతడు లక్ష్యంగా చేసుకున్నాడన్న కుట్ర కూడా బట్టబయలైంది. లష్కర్ హ్యాండ్లర్ అయిన సుహైల్‌తో అర్ష్‌దీప్ టచ్‌లో ఉన్నాడని, అతని సూచనల మేరకు సుహైల్ ఢిల్లీలోని జహంగీర్‌పురి వద్ద ఓ హిందూ బాలుడిని హత్య చేసి చంపాడని జగ్గా చెప్పాడు. తాము ఆ వీడియోని రికార్డ్ చేసి, దల్లాకు పంపినట్లు వెల్లడించారు. ఈ ఘోరమైన నేరానికి పాల్పడినందుకు గాను నేరస్తులు రూ.2 లక్షలు కూడా అందుకున్నట్టు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
ఇదిలావుండగా.. జూన్ 18వ తేదీన హత్యకు గురైన హర్దీప్ సింగ్ నిజ్జర్ కేసులో భారత ఏజెంట్ల హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంలో కెనడాలోని భారత దౌత్యాధికారిని కూడా బహిష్కరించారు. దీంతో.. భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్ కూడా కెనడాకు గట్టి కౌంటర్ ఇచ్చింది. ట్రూడో ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన భారత్.. భారత్‌లోని కెనడా దౌత్యాధికారిని దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. కెనడియన్స్‌కు తాత్కాలికంగా వీసా సర్వీసుల్ని నిలిపివేసింది. ఇలా రోజురోజుకు ఇరుదేశాల మధ్య వివాదం ముదురుతూనే ఉంది.