India-Canada Row: హమాస్ తరహా దాడి చేస్తాం.. భారత్‌కు ఖాలిస్తాని ఉగ్రవాది గురుపత్వంత్ హెచ్చరిక

ABN , First Publish Date - 2023-10-10T22:46:09+05:30 IST

భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి కెనడాలోని ఖలిస్తానీ వేర్పాటువాదుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అక్కడ భారత్‌కి వ్యతిరేకంగా వాళ్లు చేస్తున్న కార్యకలాపాలు...

India-Canada Row: హమాస్ తరహా దాడి చేస్తాం.. భారత్‌కు ఖాలిస్తాని ఉగ్రవాది గురుపత్వంత్ హెచ్చరిక

భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి కెనడాలోని ఖలిస్తానీ వేర్పాటువాదుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అక్కడ భారత్‌కి వ్యతిరేకంగా వాళ్లు చేస్తున్న కార్యకలాపాలు అన్నీఇన్నీ కావు. ఇక ఖలిస్తానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిక్స్ ఫర్ జస్టిస్’ సంస్థ అధిపతి గురుపత్వంత్ సింగ్ పన్నున్ అయితే మరింతగా రెచ్చిపోతున్నాడు. బయటకు రావడానికి భయపడుతున్న అతగాడు.. ఎక్కడో దాక్కుని భారత్‌కి వరుస వార్నింగ్‌లు ఇస్తున్నాడు. ఇప్పటికే కెనడాలోని హిందువులు దేశం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరించాడు. ప్రధాని మోదీ సహా భారత అధికారుల్నీ బెదిరించాడు. వరల్డ్ కప్‌ను వరల్డ్ టెర్రర్ కప్‌గా మారుస్తామని వాయిస్ మెసేజుల ద్వారా వార్నింగ్ సైతం ఇచ్చాడు.


ఇప్పుడు లేటెస్ట్‌గా భారత్‌పై హమాస్ తరహా దాడులు నిర్వహిస్తామంటూ గురుపత్వంత్ ఒక వీడియో విడుదల చేశాడు. ఎలాగైతే హమాస్ మెరుపుదాడులు చేసి ఇజ్రాయెల్‌ని అతలాకుతలం చేసిందో, తామూ అదే పని చేస్తామని ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధం నుంచి ప్రధాని మోదీ నేర్చుకోవాలని బీరాలు పలికాడు. పంజాబ్‌ని ఆక్రమించడానికి భారత్ ప్రయత్నిస్తే.. అందుకు తీవ్రమైన రియాక్షన్ ఉంటుందని, అందుకు ప్రధాని మోదీని బాధ్యత వహించాలని హెచ్చరించాడు. పంజాబ్ నుండి పాలస్తీనా వరకు చట్టవిరుద్ధమైన ఆక్రమణలో ఉన్న వ్యక్తులు ఇలాగే స్పందిస్తారని.. హింస హింసను ప్రేరేపిస్తుందని వ్యాఖ్యానించాడు. తమ సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ ‘బ్యాలెట్ & ఓటు’ని విశ్వసిస్తుందని.. కార్డుల్లో పంజాబ్ విముక్తి ఉంటుందని పేర్కొన్నాడు. బ్యాలెట్ కావాలో, బుల్లెట్ కావాలో భారత్ తేల్చుకోవాలని సవాల్ విసిరాడు. గతంలో అతని సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని కూడా ఓ ప్రకటన చేసింది.

ఇదిలావుండగా.. అమృత్‌సర్‌లో జన్మించిన గురుపత్వంత్ అమెరికాలో ఉంటూ తన సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థని నడిపిస్తున్నాడు. 2019లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఈ ఖలిస్తాది ఉగ్రవాదిపై తొలి కేసు నమోదు చేసినప్పటి నుంచి అతనిపై నిఘా పెట్టింది. పంజాబ్‌లో జరిగిన పలు ఉగ్రవాద ఘటనలకు అతనితో సంబంధం ఉంది. పాక్ ఉగ్సవాద సంస్థలతోనూ అతనికి సంబంధాలు ఉన్నాయి. గురుపత్వంత్‌పై పలు కేసులు నమోదు చేసిన ఎన్ఐఏ.. ఇటీవల అతనికి, అతని కుటుంబ సభ్యులకి సంబంధించిన ఆస్తులన్నింటినీ జప్తు చేసింది. 2021 ఫిబ్రవరి 3వ తేదీన ప్రత్యేక NIA కోర్టు అతనిపై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు సైతం జారీ చేసింది.

Updated Date - 2023-10-10T22:46:09+05:30 IST