Hamas : హమాస్‌కు కిమ్ ఆయుధాలు!
ABN , First Publish Date - 2023-10-20T04:39:58+05:30 IST
ఇజ్రాయెల్‌పై ముప్పేట దాడికి పాల్పడ్డ హమాస్ ఉగ్రవాదులు ఉత్తర కొరియా ఆయుధాలను వాడుతున్నారా? కిమ్ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలకు ఆయుధాలను సరఫరా చేస్తోందా? ఈ ప్రశ్నలకు ఆర్మమెంట్ రిసెర్చ్ సర్వీసెస్ నిపుణులు, దక్షిణ
ఎఫ్-7 గ్రనేడ్ లాంచర్ల వినియోగం..
గుర్తించిన నిపుణులు, దక్షిణ కొరియా
ఖండించిన ఉత్తరకొరియా.. నోరు మెదపని ఇజ్రాయెల్ సైన్యం
ఇజ్రాయెల్‌కు అండగా ఉంటాం
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రకటన
జెరూసలేం/సియోల్/న్యూఢిల్లీ, అక్టోబరు 19: ఇజ్రాయెల్‌పై ముప్పేట దాడికి పాల్పడ్డ హమాస్ ఉగ్రవాదులు ఉత్తర కొరియా ఆయుధాలను వాడుతున్నారా? కిమ్ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలకు ఆయుధాలను సరఫరా చేస్తోందా? ఈ ప్రశ్నలకు ఆర్మమెంట్ రిసెర్చ్ సర్వీసెస్ నిపుణులు, దక్షిణ కొరియా అధికారులు ఔననే చెబుతున్నారు. ఈ నెల 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడికి దిగినప్పుడు.. పెద్ద ఎత్తున రాకెట్లను ప్రయోగించడంతోపాటు.. గ్రనేడ్ లాంచర్లను వినియోగించారని వీడియోలు, ఫొటోల ద్వారా నిర్ధారణ అయ్యింది. అయితే.. ఉగ్రవాదులు వాడిన రాకెట్ ప్రొపెల్డ్ గ్రనేడ్ లాంచర్లు ఉత్తర కొరియా తయారు చేసిన ఎఫ్-7 రకానికి చెందినవని నిపుణులు చెబుతున్నారు. ‘‘ఉగ్రవాదులు విడుదల చేసిన వీడియోల్లో.. గ్రనేడ్ లాంచర్లను వినియోగిస్తున్న దృశ్యాలున్నాయి. అందులో పేలోడ్లకు ఎరుపురంగు టేప్ చుట్టి ఉంది. అవి ఉత్తర కొరియా తయారీ అనడానికి ఇదే నిదర్శనం. ఇజ్రాయెల్ సీజ్ చేసినట్లుగా చెబుతున్న గ్రనేడ్ లాంచర్ల ఫొటోలు కూడా.. అవి ఉత్తర కొరియా తయారీ ఎఫ్-7 అని స్పష్టమవుతోంది’’ అని వివరించారు.
అయితే.. ఈ అంశంపై స్పందించడానికి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె్‌స(ఐడీఎఫ్) ఇష్టపడలేదని అసోసియేట్ ప్రెస్(ఏపీ) ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ ఆరోపణలను ఉత్తరకొరియా ఖండించిందని, ఐక్యరాజ్య సమితి(ఐరాస)లోని ఉత్తర కొరియా ప్రతినిధి దీనిపై స్పందించడానికి ఇష్టపడలేదని తెలిపింది. హమా్‌సల దాడి జరిగిన తొలినాళ్లలో.. వారికి ఆయుధాలను రష్యా సరఫరా చేసిందనే ఆరోపణలు వచ్చాయి. అమెరికా నిఘా సంస్థలు కూడా రష్యాపై అనుమానాలు వ్యక్తం చేశాయి. గత వారం వైట్‌హౌస్ వర్గాలు కూడా.. ఉత్తర కొరియా నుంచి రష్యాకు వెయ్యి కంటైనర్లలో మిలటరీ ఆయుధాలు, పరికరాలు అందినట్లు వెల్లడించాయి. కాగా.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ గురువారం ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజక్ హెర్జోగ్, ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హమాస్ దాడిని ఖండించిన సునాక్.. తాము ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని ఉద్ఘాటించారు. ‘‘దుఃఖంలో ఉన్న ఇజ్రాయెల్ దేశంలో నేనున్నాను. ఉగ్రవాద భూతానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఇజ్రాయెల్‌కు ఎప్పటికీ అండగా ఉంటాం’’ అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో గాజాలో మానవతాసాయం అందాలని ఆకాంక్షించారు. గాజాలోని అల్-అహ్లీ బాప్టిస్ట్ ఆస్పత్రిపై దాడిని ఆయన ఖండించారు. మరోవైపు గాజాలో మరణాల సంఖ్య 3,785కు పెరిగిందని, 12 వేల మంది క్షతగాత్రులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. మృతుల్లో 1,524 మంది చిన్నారులు, వెయ్యి మంది మహిళలున్నారని వెల్లడించారు.
శరణార్థులకు స్కాట్లాండ్ బాసట
గాజాలోని నిరాశ్రయులకు తాము ఆశ్ర యం కల్పిస్తామని స్కాట్లాండ్ ప్రధాని హమ్జా యూసుఫ్ ప్రకటించారు. అందుకు తగ్గట్లుగా శరణార్థులకు శిబిరాలను ఏర్పాటు చేస్తామన్నారు. కాగా.. గాజాలో తన భార్య నదియా, తల్లిదండ్రులు చిక్కుకుపోయారని హమ్జా యూసుఫ్ ఇటీవల బ్రిటన్ మీడియాకు చెప్పిన విషయం తెలిసిందే. తన కుటుంబ సభ్యులు క్షేమంగా రావడంతో.. గాజాకు సహకరించాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది.