Siddaramaiah: భ్రమల్లో కుమారస్వామి... సీఎం స్ట్రాంగ్ కౌంటర్
ABN , First Publish Date - 2023-10-01T19:07:08+05:30 IST
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలనుందంటూ జేడీఎస్ నేత హెచ్.డీ.కుమారస్వామి చెప్పిన జోస్యాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొట్టివేశారు. ఆయన నిరాశానిస్పృహలతో ఉన్నారని, గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రి అవుతాననే భ్రమల్లో గడిపారని చెప్పారు.
బెంగళూరు: కర్ణాటక (Karnataka)లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలనుందంటూ జేడీఎస్ నేత హెచ్.డీ.కుమారస్వామి (HD Kumaraswamy) చెప్పిన జోస్యాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) కొట్టివేశారు. ఆయన నిరాశానిస్పృహలతో ఉన్నారని, గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రి అవుతాననే భ్రమల్లో గడిపారని చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన భ్రమలన్నీ తొలిగిపోయాయని అన్నారు. ఆ కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ ఇప్పుడు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని చెప్పారు. ఆయనను (కుమారస్వామి) అదే భ్రమల్లో ఉండనీయండంటూ ఛలోక్తి విసిరారు.
కుమారస్వామి ఏమన్నారంటే..?
కుమారస్వామి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతోకాలం అధికారంలో ఉండదని అన్నారు. తన సారథ్యంలో 14 నెలలు పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వం 2019 జూలైలో ఏవిధంగా కుప్పకూలిందో అదే గతి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా పడుతుందని జోస్యం చెప్పారు. కాగా, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి పోటీ చేసేందుకు బీజేపీతో జేడీఎస్ ఇటీవల పొత్తు పెట్టుకుంది. పొత్తులో భాగంగా జేడీఎస్ కర్ణాటకలో నాలుగు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్టు ప్రచారం జరుగగా, సీట్ల పంపకాలపై ఇంకా ఎలాంటి అవగాహనకు రాలేదని హెచ్‌డీ తెలిపారు.