Manipur Violence: మణిపూర్‌లో శాంతి భద్రతలు విఫలం... కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-06-16T15:54:34+05:30 IST
ఇంఫాల్‌లోని కాంగ్బ ప్రాంతంలో తన ఇంటిపై ఆందోళననకారులు దాడి చేసి, దహనం చేయడంపై కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఆర్కే రంజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన తనను తీవ్ర ఆందోళనకు, దిగ్భ్రాంతికి గురిచేసిందని, మణిపూర్‌లో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు.
కొచ్చి: ఇంఫాల్‌లోని కాంగ్బ ప్రాంతంలో తన ఇంటిపై ఆందోళననకారులు దాడి చేసి, దహనం చేయడంపై కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఆర్కే రంజన్ సింగ్ (RK Ranjan Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన తనను తీవ్ర ఆందోళనకు, దిగ్భ్రాంతికి గురిచేసిందని, మణిపూర్‌లో (Manipur) శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. ఆందోళనకారులు తన ఇంటిని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారో అర్ధం కావడం లేదని తెలిపారు.
''కొందరు నా ఇంటిని ధ్వంసం చేసి కూలకొట్టాలనుకున్నారు. ఇది నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రాష్ట్రంలోని నా సాటి ప్రజలే ఇలాంటి ధోరణితో వ్యవహరిస్తారని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడతారని నేను ఎప్పుడూ ఊహించలేదు. మళ్లీ ఇలాంటివి జరక్కూడదని భగవంతుడిని ప్రార్ధిస్తున్నారు. ఇలా జరగడం రెండో సారి. మొదటిసారి నేను ఆందోళనకారులకు నచ్చజెప్పాను. భద్రతా ఏర్పాట్లు జరిగాయి. నిన్న రాత్రి 10.30 గంటల వరకూ అంతా ప్రశాంతంగానే ఉంది. అకస్మాత్తుగా ఆందోళనకారులు వచ్చి, దాడులకు దిగారు'' అని సింగ్ తెలిపారు. తన ఇల్లు మంటల్లో కాలిపోతున్నప్పుడు అగ్నిమాపక సిబ్బందిని ముందుకు వెళ్లకుండా ఆందోళనకారులు అడ్డంకులు కల్పించినట్టు చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి పునరుద్ధరించేందుకు తాను తన సీనియర్ మంత్రులు, సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతున్న తరుణంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు. అసలు దాడి ఎందుకు జరిగిందో కూడా తనకు అర్ధం కావడం లేదన్నారు. అదే సమయంలో తన కుమారులు, కుమార్తెలు, కుటుంబ సభ్యులు అక్కడే ఉండే ఏమి జరిగేదని ప్రశ్నించారు. పెట్రోల్ బాంబులు విసరడం, మంటబెట్టడం చూస్తుంటే తనను కూడా మట్టుబెట్టే ఆలోచన ఉన్నట్టు కనిపిస్తోందన్నారు.
రాష్ట్ర యంత్రాంగం విఫలం..
మణిపూర్‌లో శాంతి భద్రతల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం శాంతిని నెలకొల్పే పరిస్థితిలో లేనందున కేంద్రం భారీ భద్రత కల్పించిందని, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను రంగంలోకి దింపిందని చెప్పారు. రాష్ట్ర యంత్రాంగం ఎందుకు విఫలమైందో తనకు తెలియదని అన్నారు. సుమారు 50 మంది ఆందోళనకారులు ఈ దాడిలో పాల్గొన్నట్టు తనకు తెలిసిందని మంత్రి చెప్పారు. గ్రౌండ్ ఫోర్స్, ఫస్ట్ ఫ్లోర్ బాగా దెబ్బతిన్నాయని అన్నారు. ఆ సమయంలో తాను, తన కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడం వల్ల ముప్పు తప్పిందన్నారు. కంటికి కన్ను సమాధానమైతే ప్రపంచమంతా గుడ్డిదవుతుందని, హింస వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, హింస వల్ల దేశానికి నష్టం జరుగుతుందని, హింసకు పాల్పడే వాళ్లు మానవత్వానికి వ్యతిరేకులను మెయితీ వర్గానికి చెందిన కేంద్ర మంత్రి సింగ్ అన్నారు. ఘటన అనంతరం హోం మంత్రి అమిత్‌షా తనకు ఫోన్ చేశారని, తాను రాష్ట్రంలో లేనని చెప్పానని రంజన్ సింగ్ తెలిపారు. మెయితీ, కుకీ వర్గాల మధ్య మే 3న చెలరేగిన అల్లర్లు క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడంతో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంన్నాయి. 100 మందికి పైగా ఆల్లర్లలో ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది క్షతగాత్రలయ్యారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు సైన్యాన్ని కూడా దింపారు.