C Radhakrishna Rao: ప్రముఖ గణిత శాస్త్రవేత్త సీఆర్ రావు కన్నుమూత.. ఆయన చరిత్ర ఏమిటంటే?

ABN , First Publish Date - 2023-08-23T15:21:59+05:30 IST

గణిత శాస్త్రంలో విశేషమైన సేవలు అందించిన ప్రముఖ శాస్త్రవేత్త కల్వంపూడి రాధాకృష్ణారావు (102) బుధవారం కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. అమెరికాలో...

C Radhakrishna Rao: ప్రముఖ గణిత శాస్త్రవేత్త సీఆర్ రావు కన్నుమూత.. ఆయన చరిత్ర ఏమిటంటే?

గణిత శాస్త్రంలో విశేషమైన సేవలు అందించిన ప్రముఖ శాస్త్రవేత్త కల్వంపూడి రాధాకృష్ణారావు (102) బుధవారం కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. అమెరికాలో తుదిశ్వాస విడిచారు. 75 ఏళ్ల క్రితం గణాంక రంగంలో విప్లవాత్మకమైన ఆలోచనలకు బీజం వేసినందుకు.. ఆ రంగంలో నోబెల్ బహుమతికి సమానమైన ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ అవార్డు ఈ ఏడాదిలో దక్కింది. 1945లో కోల్‌కతా మేథమేటికల్‌ సొసైటీలో ప్రచురితమైన సీఆర్‌ రావు పరిశోధన పత్రానికి గాను ఆయన ఆ అవార్డుని సొంతం చేసుకున్నారు. సీఆర్ రావు అందించిన సేవలు ఇప్పటికీ సైన్స్‌పై ఎంతో ప్రభావం చూపుతున్నాయని ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌ ఇన్‌ స్టాటిస్టిక్స్‌ ఫౌండేషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. దీన్ని బట్టి.. ఆయన చేసిన కృషి ఏంటో అర్థం చేసుకోవచ్చు.


కాగా.. సీఆర్‌ రావు 1920 సెప్టెంబరు 10న బళ్లారి జిల్లాలోని హడగళిలో తెలుగు కుటుంబంలో పుట్టారు. ఆ తర్వాత ఆయన బాల్యం ఆంధ్రప్రదేశ్‌లోనే గడిచింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఎస్‌సీ గణితం చేసిన సీఆర్ రావు.. యూనివర్సిటీ ఆఫ్‌ కోల్‌కతాలో ఎంఏ స్టాటిస్టిక్స్‌ చేశారు. 1948లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని కింగ్స్‌ కాలేజీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థిగా చేరి, అదే సంస్థకు డైరెక్టర్‌గా ఎదిగారు. ఈయన పీహెచ్‌డీ చేయడానికి ముందే.. తన పరిశోధనల్లో భాగంగా మూడు ప్రాథమిక ఫలితాల్ని విశ్లేషించారు. అవి.. క్రామెర్‌-రావు లోయర్‌ బౌండ్‌, రావు-బ్లాక్‌వెల్‌ సిద్ధాంతం, సమాచార జామెట్రీ విస్తృతికి కొత్త ఇంటర్‌ డిసిప్లినరీ ఫీల్డ్‌ అభివృద్ధి. మొదటిది గణాంక పరిమాణాన్ని అంచనా వేస్తే.. రెండోది ఒక అంచనాను మెరుగైనదిగా మార్చడానికి ఉపయోగపడుతోంది. ఇక మూడోది డేటా నుంచి సమాచారాన్ని మరింత సమర్థంగా సేకరించేందుకు తోడ్పడుతుంది. ఈ మూడు ఫలితాలు ఆధునిక గణాంక విధానానికి మార్గం సుగమం చేశాయి. అంతేకాదు.. ఈ గణాంక టూల్స్‌ సైన్స్‌లో ఉపయోగపడుతున్నాయి.

సీఆర్ రావు తన జీవిత కాలంలో 477 పరిశోధన పత్రాలు సమర్పించడంతో పాటు 15 పుస్తకాలు రాశారు. ఈ సేవలు అందించినందుకు గాను ఆయన 19 దేశాల నుంచి 39 డాక్టరేట్లు అందుకున్నారు. 2002లో అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌ చేతుల మీదుగా ఆ దేశ అత్యున్నత నేషనల్‌ మెడల్‌ ఆఫ్‌ సైన్స్‌ పురస్కారాన్ని పొందారు. యూకే ఇంటర్నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమేటికల్‌ సైన్స్‌, ఇంటర్నేషనల్‌ బయోమెట్రిక్‌ సొసైటీకి అధ్యక్షుడిగా కూడా పని చేశారు. భారత స్టాటిస్టిక్స్‌ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం సీఆర్ రావును 1968లో పద్మభూషణ్‌, 2001లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది.

Updated Date - 2023-08-23T15:21:59+05:30 IST