Sanatan Dharma Row: సనాతన ధర్మాన్ని ఎందుకు నాశనం చేయాలి.. మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-09-16T18:05:37+05:30 IST

‘సనాతన ధర్మం’పై డీఎంకే నేత, నటుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటిదని..

Sanatan Dharma Row: సనాతన ధర్మాన్ని ఎందుకు నాశనం చేయాలి.. మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు

‘సనాతన ధర్మం’పై డీఎంకే నేత, నటుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటిదని.. దీన్ని కేవలం వ్యతిరేకించడం కాదు, పూర్తిగా నిర్మూలించాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తోంది. ఇప్పుడు తాజాగా మద్రాసు హైకోర్టు ఈ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేసింది. సనాతన ధర్మం అనేది అనేది దేశం, తల్లిదండ్రులు, గురువుల పట్ల శాశ్వత కర్తవ్యాల సమాహారమని పేర్కొంది. అలాంటి సనాతన ధర్మాన్ని ఎందుకు నిర్మూలించాలని ప్రశ్నించింది.

ఇటీవల తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో ఉన్న ఒక ప్రభుత్వ కళాశాల ఓ సర్క్యులర్‌ను విడుదల చేసింది. ముఖ్యమంత్రి అన్నాదురై జయంతి సందర్భంగా.. ‘సనాతన వ్యతిరేకత’ అనే అంశంపై విద్యార్థులు తమ అభిప్రాయాలను పంచుకోవాలని ఆ సర్క్యులర్‌లో అభ్యర్థించింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. దీన్ని ఇళంగోవన్ అనే వ్యక్తి సవాల్ చేస్తూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్ శేషసాయి సింగిల్ బెంచ్.. సనాతన ధర్మం కేవలం కులతత్వం, అంటరానితనాన్ని మాత్రమే ప్రోత్సహిస్తుందనే భావనను తిరస్కరిస్తున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం సనాతన ధర్మంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న వాగ్వాదం, రాద్ధాంతం గురించి తమకు తెలుసని ధర్మాసనం పేర్కొంది.


సనాతన ధర్మం అనేది అనేక మూలాల నుండి తీసుకోబడిన శాశ్వతమైన విధుల సమాహారం అని ధర్మాసనం తెలిపింది. సనాతన ధర్మం దేశం, ప్రజలు, తల్లిదండ్రులు, గురువుల పట్ల కర్తవ్యంతో పాటు పేదల పట్ల శ్రద్ధ వహించడం.. వంటి వాటి గురించి మాట్లాడుతుందని చెప్పింది. అలాంటి కర్తవ్యాలను ఎందుకు నాశనం చేయాలని జస్టిస్ శేషసాయి అడిగారు. పౌరుడు తన దేశాన్ని ప్రేమించకూడదా? దేశానికి సేవ చేయడం అతని కర్తవ్యం కాదా? తల్లితండ్రులను జాగ్రత్తగా చూసుకోకూడదా? ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ అంశంపై జరుగుతున్న వివాదంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. చూస్తుంటే.. సనాతన ధర్మం కులతత్వాన్ని, అంటరానితనాన్ని ప్రోత్సహిస్తోందన్న ఆలోచన వచ్చినట్లు కనిపిస్తోందని, కానీ అంటరానితనాన్ని ఏ విధంగానూ సహించలేమని అన్నారు.

సనాతన ధర్మంలో అంటరానితనాన్ని అనుమతించినా.. రాజ్యాంగంలోని 17వ ఆర్టికల్ దాన్ని నిర్మూలిస్తుందని జస్టిస్ శేషసాయి తేల్చి చెప్పారు. మతానికి సంబంధించిన విషయాలలో భావప్రకటనా స్వేచ్ఛను ఉపయోగించినప్పుడు.. అది ఎవరినీ నొప్పించకుండా చూసుకోవాలని సూచించారు. భావ ప్రకటనా స్వేచ్ఛ అంటే ద్వేషపూరిత ప్రసంగం కాదన్నారు. వాక్ స్వాతంత్య్రం ప్రాథమిక హక్కు అని.. అయితే అది అది ద్వేషపూరిత ప్రసంగంగా మారకూడదని తెలిపారు. ప్రతీ మతం విశ్వాసం ఆధారంగా స్థాపించబడిందని అన్నారు.

Updated Date - 2023-09-16T18:05:37+05:30 IST