Joshimath: అందరినీ రక్షిస్తాం.. జోషిమఠ్‌లో ఉత్తరాఖండ్ సీఎం

ABN , First Publish Date - 2023-01-07T17:17:59+05:30 IST

ఉత్తరాఖండ్‌లోని హిమాలయాల్లో ఉన్న జోషిమఠ్‌(Joshimath)లో ఇటీవల సంభవిస్తున్న పరిణామాలు అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి

Joshimath: అందరినీ రక్షిస్తాం.. జోషిమఠ్‌లో ఉత్తరాఖండ్ సీఎం

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని హిమాలయాల్లో ఉన్న జోషిమఠ్‌(Joshimath)లో ఇటీవల సంభవిస్తున్న పరిణామాలు అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇళ్లు బీటలు వారుతూ కుంగిపోతుండడంతో జనం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇళ్లకు బీటలు వారుతుండడంతో ఎప్పుడు కూలిపోతాయో తెలియక భయపడుతున్నారు. దాదాపు 600 ఇళ్లు ఇలా పగుళ్లకు గురయ్యాయి. స్పందించిన అధికారులు జోషిమఠ్ నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

జోషిమఠ్‌లో ఇళ్లు బీటలు వారి కుంగిపోతున్న ఘటనలపై ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి(Pushkar Singh Dhami) స్పందించారు. శనివారం ఆయన జోషిమఠ్ సందర్శించారు. ఆయన చేరుకున్న మౌంట్ వ్యూ (Mount View) హోటల్ వద్ద సీనియర్ పోలీసు అధికారులు, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. భూమి కుంగిపోవడం(Land Subsidence)తో మౌంట్ వ్యూ-మల్లారి (Hotel Mallari) హోటళ్లు రెండు ఒకదానినిపై ఒకటి పడ్డాయి. హోటళ్ల వెనక ఉన్న పలు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పుష్కర్‌సింగ్ ధామి ఏరియల్ సర్వే(Aeiral Survey) నిర్వహించారు. అలాగే, ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి స్థానికులను కలిసి మాట్లాడారు. అనంతరం ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్ (ITBP) ఫెసిలిటీ వద్ద అధికారులతో సీఎం అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. జోషిమఠ్ ముఖ్యమైన సాంస్కృతిక ప్రదేశమని అన్నారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరినీ రక్షించడమే తమ లక్ష్యమని అన్నారు. భూమి కుంగిపోతుండడం, ఇళ్లు బీటలు వారుతుండడం వెనక ఉన్న కారణం గురించి నిపుణులు తెలుసుకుంటున్నట్టు చెప్పారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - 2023-01-07T17:18:01+05:30 IST