Covid Heart Attacks: కొవిడ్ రోగులకు కేంద్రమంత్రి హెచ్చరిక.. గుండెపోటు మరణాలపై కీలక వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-10-30T19:53:52+05:30 IST
మన భారతదేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేసిన రోజుల్లో గుండెపోటు మరణాలు ఎన్నో సంభవించాయి. మరీ ముఖ్యంగా.. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో చాలామంది...
మన భారతదేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేసిన రోజుల్లో గుండెపోటు మరణాలు ఎన్నో సంభవించాయి. మరీ ముఖ్యంగా.. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో చాలామంది మృతి చెందారు. దీంతో.. కొవిడ్‌కి, వ్యాక్సిన్‌కి, గుండెపోటుకి లింక్ ఉందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే.. ఇందులో వాస్తవం లేదని ఒక అధ్యయనం ఇటీవల తేల్చి చెప్పింది. వ్యాక్సిన్‌కి, గుండెపోటుకి ఎలాంటి లింక్ లేదని పేర్కొంది. కానీ.. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా మాత్రం కొవిడ్‌కి, గుండెపోటుకి లింక్ పెడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. కొవిడ్ రోగులు ఎక్కువగా శ్రమించకపోవడమే శ్రేయస్కరమని సూచించారు. గుజరాత్‌లో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గర్బా డ్యాన్స్ చేస్తున్న సమయంలో నమోదైన అనేక గుండెపోటు కేసులపై మాండవియా ఈ విధంగా స్పందించారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) చేసిన అధ్యయనాన్ని మాండవియా ఉదహరిస్తూ.. కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వ్యక్తులు ఎక్కువగా శ్రమించకుండా ఉండాలని అన్నారు. కనీసం ఒకట్రెండు సంవత్సరాల ఒత్తిడితో, శ్రమతో కూడిన పనులు చేయకపోవడం మంచిదని సూచించారు. ఫలితంగా.. కార్డియాక్ అరెస్ట్ వంటి గుండె సంబంధిత ముప్పు నుంచి బయటపడొచ్చని పేర్కొన్నారు. తీవ్ర వ్యాయామాలకు (ఎక్సర్‌సైజ్) కూడా దూరంగా ఉండాలన్నారు. ‘‘ICMR ఒక వివరణాత్మక అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ అధ్యయనం ప్రకారం.. కోవిడ్-19 ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న వ్యక్తులు అతిగా శ్రమించకూడదు. హార్డ్ వర్కౌట్స్, రన్నింగ్, కఠినమైన వ్యాయామాలకు కనీసం రెండు సంవత్సరాల పాటు దూరంగా ఉండాలి. ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవాలి. తద్వారా గుండెపోటును నివారించవచ్చు’’ అని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాన్సుఖ్ మాండవియా చెప్పుకొచ్చారు.
ఇదిలావుండగా.. గుజరాత్‌లో నవరాత్రుల సందర్భంగా గర్భా డ్యాన్స్ చేస్తూ 17 ఏళ్ల యువకుడు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా.. గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇలాంటి ఘటనలే అహ్మదాబాద్, నవ్సారి, రాజ్‌కోట్ ప్రాంతాల్లోనూ చోటు చేసుకున్నాయి. అటు.. వడోదర జిల్లాలోని 13 ఏళ్ల బాలుడు, 28 ఏళ్ల యువకుడు, 55 ఏళ్ల వ్యక్తి గర్బా డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి చెందారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ కూడా ఈ గుండెపోటు మరణాలపై ఆందోళన వ్యక్తం చేశారు. అటు.. కార్డియాలజిస్టులతో పాటు వైద్య నిపుణులతో రాష్ట్ర ఆరోగ్యమంత్రి రుషికేష్ పటేల్ ఓ సమావేశం నిర్వహించి, ఈ గుండెపోటు మరణాలకి గల కారణాలేంటి? అనే సమాచారం సేకరించాలని సూచించారు. అలాగే.. గుండెపోటు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.