PM Modi : ప్రపంచానికే వృద్ధి ఇంజన్‌గా భారత్‌

ABN , First Publish Date - 2023-08-23T02:36:20+05:30 IST

మున్ముందు మొత్తం ప్రపంచ వృద్ధికే భారత్‌ ఒక ఇంజన్‌లా నిలుస్తుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్‌ బిజినెస్‌ ఫోరం లీడర్స్‌ సమావేశంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

PM Modi : ప్రపంచానికే వృద్ధి ఇంజన్‌గా భారత్‌

త్వరలోనే 5 ట్రిలియన్‌ డాలర్ల వ్యవస్థగా అవతరిస్తాం..

బ్రిక్స్‌ సదస్సులో మోదీ

జొహనె్‌సబర్గ్‌/వాషింగ్టన్‌, ఆగస్టు 22: మున్ముందు మొత్తం ప్రపంచ వృద్ధికే భారత్‌ ఒక ఇంజన్‌లా నిలుస్తుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్‌ బిజినెస్‌ ఫోరం లీడర్స్‌ సమావేశంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘‘మా ప్రభుత్వం ప్రత్యేక లక్ష్యంతో పనిచేసి దేశంలో సులభతర వ్యాపారాన్ని మరింతగా పెంచాం. త్వరలోనే 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించనుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్టప్‌ వ్యవస్థ మావద్ద ఉంది’’ అని మోదీ స్పష్టం చేశారు. దక్షిణాఫ్రికాలో మంగళవారం ప్రారంభమైన బ్రిక్స్‌(బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల 15వ సదస్సు గురువారం వరకూ జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు మంగళవారం జొహెన్‌సబర్గ్‌కు మోదీ చేరుకున్నారు. వాటర్‌క్లూఫ్‌ వాయుసేన స్థావరంలో మంగళవారం ల్యాండ్‌ అయిన భారత ప్రధానికి దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్‌ మషాటిలే స్వాగతం పలికారు. అనంతరం జొహనె్‌సబర్గ్‌లో బ్రిక్స్‌ సదస్సు జరగనున్న శాండ్‌టన్‌ సన్‌ హోటల్‌కు చేరుకున్న మోదీకి సంగీత వాయిద్యాలు, భారత పతాకాలతో ప్రవాస భారతీయులు ఆహ్వానం పలికారు. వారిలో ఇద్దరు మహిళలు ఆయనకు రాఖీ కట్టడం విశేషం. అనంతరం నార్త్‌ రైడింగ్‌లో 14.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న స్వామినారాయణ్‌ ఆలయాన్ని ప్రధాని సందర్శించారు. కాగా.. ఈ సదస్సు ముగిసిన అనంతరం గ్రీస్‌లో ఒకరోజు పర్యటనకు ప్రధాని చేరుకుంటారు.

2modi-rakhi.jpg

వచ్చే 7న భారత్‌కు బైడెన్‌

వచ్చే నెల 7 నుంచి 10 వరకూ భారత్‌లో జరిగే జీ-20 సదస్సులో పాల్గొనేందుకు గాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భారత్‌కు రానున్నారని శ్వేతసౌధ కార్యాలయం మంగళవారం తెలిపింది. వివిధ ప్రపంచ సమస్యలపై జీ20 భాగస్వామ్య దేశాలు చర్చిస్తాయని శ్వేతసౌధ ప్రెస్‌ సెక్రటరీ కరీన్‌ జీన్‌-పియరీ తెలిపారు.

Updated Date - 2023-08-23T02:36:23+05:30 IST