Vishwakarma Yojana scheme : వృత్తి నైపుణ్యంగలవారికి మోదీ ప్రభుత్వం శుభవార్త!
ABN , First Publish Date - 2023-08-16T16:19:30+05:30 IST
సంప్రదాయ వృత్తుల్లో నైపుణ్యంగలవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ.13 వేల కోట్ల వ్యయంతో దాదాపు 30 లక్షల మంది వృత్తిపనివారికి, వారి కుటుంబాలకు ప్రయోజనం కలిగించే ‘పీఎం విశ్వకర్మ’ పథకానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది.
న్యూఢిల్లీ : సంప్రదాయ వృత్తుల్లో నైపుణ్యంగలవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ.13 వేల కోట్ల వ్యయంతో దాదాపు 30 లక్షల మంది వృత్తిపనివారికి, వారి కుటుంబాలకు ప్రయోజనం కలిగించే ‘పీఎం విశ్వకర్మ’ పథకానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేలు, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలిపారు.
పీఎం విశ్వకర్మ పథకం గురించి మోదీ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా చేసిన ప్రసంగంలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అశ్విని వైష్ణవ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను వివరించారు. పీఎం విశ్వకర్మ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభించిందని చెప్పారు. ఈ పథకం కోసం ఐదేళ్లపాటు రూ.13,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. తొలి దశలో 18 సంప్రదాయ వృత్తులకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. చేతి వృత్తిపనివారికి పీఎం విశ్వకర్మ సర్టిఫికేట్లను జారీ చేసి, వారికి గుర్తింపునిస్తామన్నారు. వారికి గుర్తింపు కార్డులను ఇచ్చి, తొలి దశలో రూ.1 లక్ష వరకు, రెండో దశలో రూ.2 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ఈ రుణంపై రాయితీ వడ్డీ రేటు 5 శాతం అని చెప్పారు. నైపుణ్యాభివృద్ధి, వృత్తి సంబంధిత పరికరాల కొనుగోలుకు ప్రోత్సాహం, డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహకాలు, మార్కెటింగ్ మద్దతు అందజేయనున్నట్లు చెప్పారు. వడ్రంగి పనివారు, పడవల తయారీదారులు, బ్లాక్‌స్మిత్, లాక్‌స్మిత్, గోల్డ్‌స్మిత్, కుండల తయారీదారులు, శిల్పులు, చర్మకారులు, తాపీ మేస్త్రిలు తదితరులు ఈ పథకం క్రింద లబ్ధి పొందవచ్చునని చెప్పారు.
ఈ మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, పీఎం ఈ-బస్ సేవకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. గ్రీన్ అర్బన్ మొబిలిటీ ఇనీషియేటివ్ క్రింద 181 నగరాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. దేశంలోని 169 నగరాల్లో 10,000 ఈ బస్సులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రైవేట్-ప్రభుత్వ భాగస్వామ్యం విధానంలో దీనిని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకానికి రూ.57,613 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు చెప్పారు. ఈ వ్యయంలో రూ.20 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం సమకూర్చుతుందన్నారు. పదేళ్లపాటు బస్సు సేవలకు ఈ పథకం అండదండలు అందిస్తుందన్నారు. ఈ పథకం వల్ల దాదాపు 45 వేల నుంచి 55 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన తెలిపింది.
ఇవి కూడా చదవండి :
Birthday wishes : కేజ్రీవాల్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన మోదీ
Atal Bihari Vajpayee : మాజీ ప్రధాని ఏబీ వాజ్‌పాయి నాయకత్వంతో దేశానికి గొప్ప మేలు : మోదీ