PM Modi: పేరు చూసి మోసపోరు

ABN , First Publish Date - 2023-07-26T03:01:57+05:30 IST

ఈస్ట్‌ ఇండియా కంపెనీ, ఇండియన్‌ ముజాహిదీన్‌, పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా పేర్లలో కూడా ఇండియా అనే పదం ఉన్నదని, ఇండియా అనే పేరు పెట్టుకున్నంత మాత్రాన ప్రజలేమీ మోసపోరని విపక్ష కూటమి ‘ఇండియా’ను ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

PM Modi: పేరు చూసి మోసపోరు

ఈస్ట్‌ ఇండియా కంపెనీ, ఇండియన్‌ ముజాహిదీన్‌!.. వీటి పేర్లలో కూడా ఇండియా ఉంది

ప్రతిపక్షాలను జనం నమ్మే పరిస్థితి లేదు

ఆ పార్టీలకు దశాదిశాలేదు.. చాలా కాలం

విపక్ష స్థానంలో ఉండటానికే సిద్ధమయ్యాయి

‘ఇండియా’ కూటమిపై మోదీ వ్యాఖ్యలు

వచ్చే ఎన్నికల్లో మళ్లీ తమదే విజయమని ధీమా

న్యూఢిల్లీ, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ఈస్ట్‌ ఇండియా కంపెనీ(East India Company), ఇండియన్‌ ముజాహిదీన్‌(Indian Mujahideen), పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(Popular Front of India) పేర్లలో కూడా ఇండియా అనే పదం ఉన్నదని, ఇండియా అనే పేరు పెట్టుకున్నంత మాత్రాన ప్రజలేమీ మోసపోరని విపక్ష కూటమి ‘ఇండియా’ను ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రతిపక్షాల కూటమి(Alliance of Opposition)కి ఎటువంటి దిశ దశ లేదని, ఇటువంటి విపక్షాలను మన దేశం గతంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ(BJP is a parliamentary party) సమావేశంలో మోదీ మాట్లాడుతూ విపక్షాలపై విరుచుకుపడ్డారు. ఈ వివరాలను కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి విలేకర్లకు వెల్లడించారు. ‘అనేక నిషేధిత తీవ్రవాద సంస్థలు, ఉగ్రవాద సంస్థలు కూడా భారతదేశం పేరును ఉపయోగించుకున్న చరిత్ర ఉంది. దేశాన్ని విభజించి పాలించాలనుకున్న సంస్థలు, ప్రజలను పక్కదారి పట్టించాలనుకున్న సంస్థలు ఇండియా, ఇండియన్‌ వంటి పేర్లు పెట్టుకున్నాయి.


కానీ, జనం పరిణతి చెందారు. ఇటువంటి పేర్ల వల్ల మోసపోరు’ అని మోదీ చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీకి ఆ పేరును ఆంగ్లేయుడైన ఏఓ హ్యూమ్‌ పెట్టారని ఆయన గుర్తు చేశారు. పార్లమెంటులో గత కొన్ని రోజులుగా ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ, ప్రతిపక్షాలు పూర్తి నిరాశలో కూరుకుపోయాయని, రానున్న చాలా కాలంపాటు విపక్ష స్థానంలోనే కూర్చోవటానికి అవి సిద్ధమయ్యాయని మోదీ పేర్కొన్నారు. అవినీతిపరులైన నేతలు, పార్టీల సమ్మేళనమే విపక్ష కూటమి అని ఆరోపించారు. తన పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే పదో స్థానం నుంచి ఐదో స్థానానికి చేరుకున్నదని, మూడో దఫా తాము అధికారంలోకి వస్తే భారత్‌ మూడో స్థానానికి కూడా చేరువవుతుందని మోదీ ఉద్ఘాటించారు. భారత్‌ గురించి దేశ విదేశాల్లో ఒక కొత్త ఆశావాదం తొణికిసలాడుతోందని పేర్కొంటూ దీనిని నవోదయంగా అభివర్ణించారు. ఇటీవల సమావేశమైన ఎన్డీఏను ప్రస్తావిస్తూ, వాజపేయి, అద్వానీ వంటి దిగ్గజ నేతల వారసత్వాన్ని ఎన్డీఏ కొనసాగిస్తున్నదని అన్నారు. రానున్న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావటం తధ్యమని అన్నారు.

Updated Date - 2023-07-26T05:08:17+05:30 IST