Ajit Doval : నేతాజీ ఉండుంటే దేశం విడిపోయేది కాదు
ABN , First Publish Date - 2023-06-18T01:02:00+05:30 IST
నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉండి ఉంటే భారతదేశ విభజన జరిగేది కాదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అన్నారు. ప్రముఖ వాణిజ్య సంస్థ ఆసోచామ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్మారకోపన్యాస కార్యక్రమంలో
● సుభాష్ వల్లే దేశానికి స్వాతంత్య్రం: డోభాల్
న్యూఢిల్లీ, జూన్ 17: నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉండి ఉంటే భారతదేశ విభజన జరిగేది కాదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అన్నారు. ప్రముఖ వాణిజ్య సంస్థ ఆసోచామ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్మారకోపన్యాస కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. బోస్‌ను ‘‘అత్యంత మతపరమైన వ్యక్తి’’గా అభివర్ణించారు. గాంధీని కూడా సవాలు చేసే ధైర్యం నేతాజీకి ఉందన్నారు. అయితే జాతిపితపై గౌరవంతో ఆయన మార్గానికి అడ్డుపడలేదన్నారు. దేశానికి స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ వారిని అర్థించడాన్ని బోస్ తీవ్రంగా వ్యతిరేకించారని చెప్పారు. నేతాజీ ఒక్కడిని మాత్రమే నాయకుడిగా అంగీకరిస్తానని మహమ్మద్ అలీ జిన్నా సైతం అప్పట్లో వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. ‘‘నేతాజీ సృష్టించిన జాతీయ వాదమే తనను భయపెట్టిందని 1956లో మాజీ బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీ చెప్పారు. బ్రిటిషర్లు దేశాన్ని వదిలిపోవడానికి నేతాజీనే కారణమని ఆయన తెలిపారు. అటువంటి మహోన్నత వ్యక్తి నేతాజీకి చరిత్రలో సరైన గౌరవం దక్కలేదు’’ అని డోభాల్ పేర్కొన్నారు. అటువంటి నేతాజీ పట్ల చరిత్ర నిర్దయగా వ్యవహరించిందని, దాన్ని తిరగరాసేలా ప్రధాని మోదీ ప్రయత్నాలు చేయడం హర్షణీయమన్నారు.