Share News

Nitish Kumar: నితీశ్ కుమార్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు.. రివర్స్‌లో కౌంటర్ల మీద కౌంటర్లు

ABN , First Publish Date - 2023-11-09T21:41:31+05:30 IST

Bihar Assembly: బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఇటీవల జనాభా నియంత్రణ విషయంలో మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. చదువుకున్న మహిళలకు తన భర్తల్ని ఎలా నియంత్రించాలో తెలుసంటూ.. అసెంబ్లీ సాక్షిగా ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.

Nitish Kumar: నితీశ్ కుమార్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు.. రివర్స్‌లో కౌంటర్ల మీద కౌంటర్లు

బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఇటీవల జనాభా నియంత్రణ విషయంలో మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. చదువుకున్న మహిళలకు తన భర్తల్ని ఎలా నియంత్రించాలో తెలుసంటూ.. అసెంబ్లీ సాక్షిగా ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంకా ఈ వివాదం చల్లారకముందే.. నితీశ్ కుమార్ మరోసారి తన నోటికి పని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్) వ్యవస్థాపకుడు జితన్ రామ్ మాంఝీపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ.. ‘మూర్ఖత్వం’ అనే మాటని వినియోగించారు. దీంతో.. అసెంబ్లీలో గందరగోళ వాతావరణం నెలకొంది. అంతేకాదు.. నితీశ్ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వచ్చిపడుతున్నాయి.


అసలే ఏమైందంటే..?

ఇటీవల బిహార్‌లో నిర్వహించిన ‘కుల ఆధారిత సర్వే’ సరైనదని తాము నమ్మడం లేదని, ఒకవేళ లెక్కలు తప్పైతే ‘ప్రయోజనాలు’ సరైన వ్యక్తులకు చేరవని జితన్ రామ్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై నితీశ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘‘నేను ఆయన్ను ముఖ్యమంత్రిని చేశాను. అసలేం మాట్లాడుతున్నాడో అతనికి ఐడియా ఉందా? నా మూర్ఖత్వం వల్లే ఆయన గతంలో సీఎం అయ్యాడు. 2013లో బీజేపీ పార్టీ జితన్‌ని ఒంటరిగా వదిలేసినప్పుడు.. నేను ఆయన్ను సీఎం చేశాను. కానీ.. నేను నెలలు గడిచిన తర్వాత పార్టీ నేతలు ఏదో తేడా ఉందని, ఆయన్ను సీఎం పదవి నుంచి తప్పించండని నాతో చెప్పారు. అప్పుడు నేనే మళ్లీ బలవంతంగా ముఖ్యమంత్రినయ్యాను’’ అని అన్నారు.

ఇదే సమయంలో.. బీజేపీ ఎందుకు జితన్‌ని గవర్నర్‌గా ఎంపిక చేయడం లేదని నితీశ్ కుమార్ ప్రశ్నించారు. అప్పుడు సభలో గందరగోళం నెలకొంది. నితీశ్ వ్యాఖ్యలతో నొచ్చుకున్న బీజేపీ నేతలు హంగామా షురూ చేశారు. ఈ దెబ్బకు అసెంబ్లీ వాయిదా వేయాల్సి వచ్చింది. సభ వాయిదా పడ్డాక బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానందన్ పాశ్వాన్ మాట్లాడుతూ.. నితీశ్ కుమార్‌కి పిచ్చి పట్టినట్టు ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జితన్ రామ్ పట్ల సీఎం నితీశ్ అమర్యాదకరమైన పదజాలాన్ని ఉపయోగించారని, అతనిని దుర్భాషలాడారని మండిపడ్డారు. తాము దీనిని ఏమాత్రం సహించమన్నారు. ముఖ్యమంత్రి మానసిక క్షోభకు గురవుతున్నారు. ఆయనకు చికిత్స అవసరమని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


నితీశ్ వ్యాఖ్యలకు జితన్ రామ్ కౌంటర్

తనపై నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు జితన్ రామ్ మాంఝీ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత తన ప్రతిష్టను కాపాడుకునేందుకు తనని నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి చేశారని అన్నారు. నితీశ్ మాట్లాడిన మాటలు తనను షాక్‌కి గురి చేశాయన్నారు. అతని మానసిక స్థితి బాగోలేదని, అందుకే ఇలా మాట్లాడుతున్నానని ఎద్దేవా చేశారు. అతని కంటే తాను పెద్దవాడినైనా, తన పట్ల నితీశ్ అగౌరవంగా మాట్లాడాడని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నీ చేతకానితనాన్ని దాచుకోవడానికి, కేవలం దళితుడిపైనే దాడి చేయగలవు. నీకు నిజంగా దమ్ముంటే, లలన్ సింగ్‌కి వ్యతిరేకంగా మాట్లాడి చూపించు” అని మాంఝీ సవాల్ విసిరారు.

Updated Date - 2023-11-09T21:41:32+05:30 IST