Nitish Kumar: బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి.. మరోసారి డిమాండ్ చేసిన సీఎం నితీశ్ కుమార్
ABN , First Publish Date - 2023-12-10T23:01:59+05:30 IST
తమ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా కల్పించాలని సుదీర్ఘకాలం నుంచి తాను చేస్తున్న డిమాండ్‌ని సీఎం నితీశ్ కుమార్ మరోసారి లేవనెత్తారు. ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన తూర్పు జోనల్ కౌన్సిల్ 26వ సమావేశంలో...
Nitish Kumar Demands Special Status: తమ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా కల్పించాలని సుదీర్ఘకాలం నుంచి తాను చేస్తున్న డిమాండ్‌ని సీఎం నితీశ్ కుమార్ మరోసారి లేవనెత్తారు. ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన తూర్పు జోనల్ కౌన్సిల్ 26వ సమావేశంలో ఆయన ఈ అభ్యర్థన చేశారు. అలాగే.. అణగారిన కులాల కోటాలను 50 నుండి 65 శాతం పెంచి రాష్ట్ర చట్టాలను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో ఉంచాలనే అభ్యర్థనను కూడా కేంద్రం పరిశీలిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
‘‘అమిత్ షా అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశంలో బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కేంద్రాన్ని కోరారు. 2010 నుంచే ఈ ప్రత్యేక హోదా అంశాన్ని రాష్ట్రం లేవనెత్తుతోంది. ఇప్పుడు రాష్ట్రంలో మహాకూటమి ప్రభుత్వం నిర్వహించిన కులాల సర్వే ఫలితాల నేపథ్యంలో ఈ హోదా డిమాండ్ ఎంతో అవసరమైంది’’ అని సీఎంఓ ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం అణగారిన కుటుంబాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాలని యోచిస్తోందని.. వాటిని అమలు చేసేందుకు గాను రూ.2.50 లక్షల కోట్ల వ్యయం అవుతుందని నితీశ్ కుమార్ అన్నారు. అందుకే.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని తాము డిమాండ్ చేస్తున్నామని ఆయన వివరణ ఇచ్చారు.
‘‘రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో అణగారిన కులాల కోటాను 50 నుంచి 65 శాతానికి పెంచుతూ.. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో రెండు సవరణల బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టాలని, వారిని చట్టపరమైన పరిశీలనకు దూరంగా ఉండేలా చేయాలని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కోరారు. బిహార్ బీజేపీ కూడా ఈ రెండు బిల్లులకు అసెంబ్లీ, కౌన్సిల్‌లో మద్దతు ఇచ్చింది కాబట్టి.. కేంద్రం మరింత ఆలస్యం చేయకుండా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో వాటిని పెట్టాలని సీఎం స్పష్టంగా చెప్పారు’’ అని సీఎంఓ ఆ ప్రకటనలో వెల్లడించింది. మరి.. ఇప్పటికైనా కేంద్రం దిగొచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి.