Share News

Nitish Kumar: కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద తప్పు చేసింది.. నితీశ్ కుమార్ ధ్వజం

ABN , First Publish Date - 2023-12-04T17:09:46+05:30 IST

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చడిచూడటంపై జేడీ(యూ) అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇండియా కూటమిలోని..

Nitish Kumar: కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద తప్పు చేసింది.. నితీశ్ కుమార్ ధ్వజం

Nitish Kumar On Congress: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చడిచూడటంపై జేడీ(యూ) అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇండియా కూటమిలోని మిత్రపక్షాలతో సీట్లు పంచుకోకుండా ఒంటరిగా పోరుకి వెళ్లి, కాంగ్రెస్ చాలా పెద్ద తప్పు చేసిందని ధ్వజమెత్తారు. ‘‘కేవలం జాతీయ స్థాయిలో మాత్రమే పొత్తు ఉందని చెప్పడంలో అర్థం లేదు. మీరు రాష్ట్రాల్లో విడిగా పోటీ చేయాలని నిర్ణయించారు. కేవలం సమావేశాలు నిర్వహిస్తూ మైదానంలో కార్యాచరణలు చేపట్టకుండా ఉంటే.. ప్రజలకు ఈ ఇండియా కృత్రిమంగా కనిపిస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు.


కేవలం కుల గణన, OBCల గురించి ప్రస్తావించడం.. వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా, అణగారిన కులాల కోటాలను పెంచడం వంటి వాటిని కాంగ్రెస్ అనుసరించలేదని నితీశ్ కుమార్ మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికలకు కొద్ది నెలల ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాలన్నీ అవసరం అయ్యాయని అన్నారు. బీహార్‌లో ప్రారంభించినది ఇతర రాష్ట్రాలకు కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. సామాజిక సమస్యలను లేవనెత్తడం ద్వారానే బీజేపీ మతపరమైన ఉన్మాద రాజకీయాలను ఎదుర్కోవచ్చని ఆయన సూచించారు. తాను ప్రధానమంత్రి పదవిని ఆశించేవాడిని కాదని, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడమే తన ఏకైక లక్ష్యమని అన్నారు. పాట్నా, ముంబై, బెంగళూరులో నిర్వహించిన సమావేశాలతో ఇండియా కూటమి ఊపందుకుందని.. డిసెంబర్ 6న ఢిల్లీలో జరిగే సమావేశం మరింత జోష్ నింపుతుందని ఆశిస్తున్నామని అభిప్రాయపడ్డారు.

జేడీయూ ముఖ్య అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ నీరజ్ కుమార్ సైతం కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ మతవాద ఉన్మాద రాజకీయాలకు సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవడం వల్లే ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి చవిచూసిందని పేర్కొన్నారు. కాగా.. ఏ విధంగా అయితే ఇండియా కూటమిలో మిత్రపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసిందో, జేడీయూ సైతం ఐదు స్థానాల్లో పోటీ చేసింది. ఒకవేళ వీళ్లు సీట్లు పంచుకొని, కలిసికట్టుగా పోటీ చేసి ఉంటే.. బహుశా బీజేపీకి గట్టి పోటీనిచ్చేవాళ్లేమో! ఏదేమైనా.. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంపై.. మిత్రపక్షాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

Updated Date - 2023-12-04T17:09:48+05:30 IST