Nitish Kumar: ఇండియా కూటమిలో చీలికలు.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చిన నితీశ్ కుమార్
ABN , First Publish Date - 2023-09-18T16:28:10+05:30 IST
ఇటీవల 14 మంది న్యూస్ యాంకర్లను ఇండియా కూటమి బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయం గురించి తనకేమీ తెలియదంటూ బిహార్ సీఎం నితీశ్ కుమార్ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అంతేకాదు..
ఇటీవల 14 మంది న్యూస్ యాంకర్లను ఇండియా కూటమి బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయం గురించి తనకేమీ తెలియదంటూ బిహార్ సీఎం నితీశ్ కుమార్ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అంతేకాదు.. న్యూస్ యాంకర్లకు తన మద్దతు కూడా ఉంటుందని కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమిలో విభేదాలు నెలకొన్నాయని ప్రచారాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా.. నితీశ్ కుమార్ ఈ కూటమిని వీడనున్నారని రూమర్లు జోరుగా చక్కర్లు కొట్టాయి. అయితే.. ఈ ప్రచారాల్లో ఏమాత్రం వాస్తవం లేదని నితీశ్ కుమార్ స్వీట్ ట్విస్ట్ ఇచ్చారు. తామంతా కలిసే ఉన్నామని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పారు.
సోమవారం నితీశ్ కుమార్ విలేఖరులతో మాట్లాడుతూ.. ‘‘మేమంతా ఐక్యంగా, చెక్కుచెదరకుండా ఉన్నాం. ఇండియా కూటమిలో ఎలాంటి చీలికలు లేవు. మేమంతా ప్రజల కోసం పని చేస్తున్నాం, ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాం. మేము బిహార్‌లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. మంచి రహదారులు, వంతెనలు, విద్యుత్, తాగునీటి సౌకర్యాలతో పాటు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్వహించాం. మేము రాష్ట్రంలో ఎంతో పని చేశాం. ఇక తుది నిర్ణయం ఓటర్లే తీసుకుంటారు’’ అని అన్నారు. ఇక కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలను నిర్వాహించాలని యోచిస్తోందని తాను ముందు నుంచే చెబుతున్నానని.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తామంతా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వాళ్లను ముందస్తు ఎన్నికలనే నిర్వహించుకోనివ్వండని చెప్పారు.
ఇంకా నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుత పాలనలో మీడియాకు సంకెళ్లు వేయబడిందని.. పాలనలో మార్పు వస్తే జర్నలిస్టులకు విముక్తి లభిస్తుందని అన్నారు. కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత జర్నలిస్టులకు తప్పకుండా విముక్తి వస్తుందన్నారు. ప్రస్తుతం కేంద్రంలోని ప్రభుత్వం మీడియాని నియంత్రిస్తోందని ఆరోపించారు. తాను జర్నలిస్టులకు పూర్తి మద్దతు ఇస్తున్నానని.. అందరికీ పూర్తి స్వేచ్ఛ లభించినప్పుడే జర్నలిస్టులు తమకు నచ్చింది రాష్టారని చెప్పుకొచ్చారు. కాగా.. గతేడాది వరకూ బీజేపీతో కలిసి ఉన్న నితీశ్, ఆ పార్టీతో సంబంధాలు తెంచుకొని, ఇండియా కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు.