BJP Vote Issue: బీజేపీకి ఓటు వేయకపోతే, నీళ్లు ఇచ్చేది లేదు.. గ్రామీణ మహిళల ఆవేదన
ABN , First Publish Date - 2023-11-22T19:00:45+05:30 IST
మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన రెండు రోజుల తర్వాత ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అధికార బీజేపీకి ఓటు వేసినట్లు ప్రమాణం చేయకపోతే, తమకు బోర్‌వెల్ నుండి నీళ్లు అందించడం లేదని గ్రామీణ మహిళలు ఆరోపిస్తున్నారు.
Madhya Pradesh BJP: మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన రెండు రోజుల తర్వాత ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అధికార బీజేపీకి ఓటు వేసినట్లు ప్రమాణం చేయకపోతే, తమకు బోర్‌వెల్ నుండి నీళ్లు అందించడం లేదని గ్రామీణ మహిళలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర మంత్రి బ్రిజేంద్ర సింగ్ యాదవ్ ప్రాథనిథ్యం వహిస్తున్న ముంగవాలి అసెంబ్లీ నియోజకవర్గంలోని నాయఖేడ గ్రామం నుండి ఈ నివేదికలు వచ్చాయి. తమకు ఓటు వెయ్యలేదనే అక్కసుతో తాగేనీళ్లు కూడా ఇవ్వడం లేదని వాళ్లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఇలాగైతే తామెలా బ్రతకాలని నిలదీస్తున్నారు.
బీజేపీకి ఓటు వేశారా? లేదా? అని ఆ పార్టీ వాళ్లు అడుగుతున్నారని.. ఒకవేళ వేయలేదని చెప్తే, మోటార్ స్విచ్ ఆఫ్ చేసి తమని తమిరికొడుతున్నారని శ్యామ్ బాయి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఓటింగ్ ముగిసిన తర్వాత వాళ్లు బోర్ నడపడం పూర్తి ఆపేశారని మరో నివాసి వాపోయింది. కేవలం రాత్రిపూట మాత్రమే స్విచ్ ఆన్ చేస్తున్నారని, అది కూడా తమకు సమాచారం అందడం లేదని పేర్కొన్నారు. ఇతర నివాసితులు సైతం ఇలాంటి ఫిర్యాదులే చేశారు. బీజేపీ అనే పేరుని ప్రస్తావించడం లేదు కానీ.. ‘పువ్వు’ (బీజేపీ గుర్తు కమలం)కు ఓటు వేయకుంటే, నీళ్లు ఇవ్వబోమని తమకు చెప్పారని ఆ నివాసితులు చెప్పారు.
అయితే.. గ్రామస్తుల ఆరోపణల్ని మంత్రి బ్రిజేంద్ర సింగ్ యాదవ్ ఖండించారు. ఎన్నికల తర్వాతే ఇలాంటివి ఎందుకు జరుగుతాయో తనకు అర్థం కావడం లేదని అన్నారు. ఆ గ్రామంలో ఉన్నవన్నీ ప్రభుత్వ బోర్‌వెల్స్ అని, ఆ బావుల్ని నిర్మించి గ్రామంలో నీటి సమస్య లేకుండా చేసిందని, తానే ఆ గ్రామంలో నాలుగు బోర్లు వేయించానని చెప్పారు. ఏ ఒక్కరూ నీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కోకూడదని, అందరినీ నీళ్లు అందించేందుకు బోర్లు వేశామని క్లారిటీ ఇచ్చారు. కానీ.. గ్రామస్తులు మాత్రం ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించట్లేదు. బీజేపీకి ఓటు వేస్తేనే నీళ్లు అందిస్తున్నారని, లేదంటే ఇవ్వట్లేదని చెప్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై విమర్శలు వచ్చిపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రణదీప్ సింగ్ సూర్జేవాలా తన ఎక్స్ ఖాతాలో ఒక క్లిప్పింగ్‌ని పంచుకున్నారు. బీజేపీ డబుల్ ఇంజిన్ వాదనలన్నీ నకిలీవని, వాళ్లు అసలు రూపం ఇదేనంటూ దుయ్యబట్టారు. అవినీతి, దుష్పరిపాలన, దౌర్జన్యాలకు మధ్యప్రదేశ్ ప్రజలు సమాధానం ఇచ్చారని అన్నారు. గత 18 సంవత్సరాల నుంచి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని.. ఇంకా బీజేపీకి దాహం తీరలేదని, ఓట్లు వేయని వారిని నీళ్ళు అందించడం లేదని మండిపడ్డారు. మరికొన్ని రోజుల్లోనే ఈ అన్యాయాలకు లెక్క తేలబోతోందని హెచ్చరించారు.