North Korea : తల్లిదండ్రుల వద్ద బైబిల్ ఉందని, రెండేళ్ల చిన్నారికి జీవిత ఖైదు : అమెరికన్ నివేదిక
ABN , First Publish Date - 2023-05-27T18:52:49+05:30 IST
ఉత్తర కొరియాలో క్రైస్తవులు అత్యంత తీవ్రమైన శిక్షలకు గురవుతున్నారని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ నివేదిక వెల్లడించింది. బైబిల్‌తో పట్టుబడినవారికి మరణ శిక్ష,
న్యూఢిల్లీ : ఉత్తర కొరియాలో క్రైస్తవులు అత్యంత తీవ్రమైన శిక్షలకు గురవుతున్నారని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ నివేదిక వెల్లడించింది. బైబిల్‌తో పట్టుబడినవారికి మరణ శిక్ష, వారి కుటుంబ సభ్యులకు జీవిత ఖైదు విధిస్తున్నారని తెలిపింది. పసిబిడ్డలకు కూడా జీవిత ఖైదు విధిస్తున్నట్లు పేర్కొంది. క్రైస్తవులతోపాటు ఇతర మతస్థులు కూడా ఇటువంటి దారుణ శిక్షలకు గురవుతున్నట్లు తెలిపింది.
అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడమ్ రిపోర్ట్, 2022లో వెల్లడించిన వివరాల ప్రకారం, ఉత్తర కొరియాలో క్రైస్తవులు, ఇతర మతాలవారు దాదాపు 70 వేల మంది జైలు శిక్షను అనుభవిస్తున్నారు. పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే, రెండేళ్ల చిన్నారి తల్లిదండ్రుల వద్ద బైబిల్ ఉండటంతో, ఆ బాలుడితోపాటు మొత్తం కుటుంబ సభ్యులకు జీవిత ఖైదు విధించారు. ఈ సంఘటన 2009లో జరిగింది. వీరిని రాజకీయ కారాగార శిబిరంలో ఉంచినట్లు తెలుస్తోంది.
మతాచారాలను పాటించేవారిని ఉత్తర కొరియా తీవ్రంగా శిక్షిస్తోంది. బైబిల్ కలిగియున్నవారిపై విరుచుకుపడుతోంది. రాజకీయ కారాగార శిబిరాల్లో శిక్షను అనుభవిస్తున్నవారు చెప్తున్నదాని ప్రకారం ఈ కేంద్రాల్లో శారీరకంగా హింసిస్తున్నట్లు తెలుస్తోంది. షమనిక్ అడహరెంట్స్, క్రైస్తవులపై మానవ హక్కుల ఉల్లంఘనలకు కారణం 90 శాతం వరకు ఉత్తర కొరియా స్టేట్ సెక్యూరిటీ మంత్రిత్వ శాఖేనని ఈ నివేదిక తెలిపింది.
ఉత్తర కొరియాలో న్యాయం, జవాబుదారీతనం కోసం పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థ కొరియా ఫ్యూచర్ ప్రచురించిన నివేదికను అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రస్తావించింది. మతాచారాలను పాటించేవారిపైనా, మతపరమైన వస్తువులను కలిగియున్నవారిపైనా ఉత్తర కొరియా ప్రభుత్వం తీవ్రంగా దాడి చేస్తోందని తెలిపింది. మతానికి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడినా, మతపరమైన నమ్మకాలను ఒకరితో మరొకరు పంచుకున్నా అణచివేస్తోందని తెలిపింది. మతపరమైన విశ్వాసాలుగలవారిని అరెస్ట్ చేయడం, నిర్బంధించడం, బలవంతంగా పని చేయించడం, హింసించడం, న్యాయమైన విచారణ జరగకుండా నిరోధించడం, దేశం నుంచి వెళ్లగొట్టడం, జీవించే హక్కును నిరాకరించడం, లైంగిక హింసకు గురిచేయడం జరుగుతున్నట్లు తెలిపింది.
ఇవి కూడా చదవండి :
Ghaziabad: ఫుడ్ ప్యాకెట్‌లో ఉమ్మి వేసిన రెస్టారెంట్ ఉద్యోగి
Delhi University : ‘సారే జహా సే అచ్ఛా’ రచయిత ఇక్బాల్‌పై పాఠం సిలబస్ నుంచి తొలగింపు