Share News

INDIA Alliance: అఖిలేష్ తర్వాత ఇండియా కూటమిపై ప్రశ్నలు లేవనెత్తిన ఒమర్ అబ్దుల్లా.. ఏమన్నారంటే?

ABN , First Publish Date - 2023-11-07T19:43:09+05:30 IST

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా.. కొన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ కూటమి ఇప్పటివరకూ మూడు సమావేశాల్ని విజయవంతంగా నిర్వహించింది. కానీ..

INDIA Alliance: అఖిలేష్ తర్వాత ఇండియా కూటమిపై ప్రశ్నలు లేవనెత్తిన ఒమర్ అబ్దుల్లా.. ఏమన్నారంటే?

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా.. కొన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ కూటమి ఇప్పటివరకూ మూడు సమావేశాల్ని విజయవంతంగా నిర్వహించింది. కానీ.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభానికి కొన్ని రోజుల ముందు నుంచి మాత్రం కూటమిలో ‘అలజడులు’ మొదలయ్యాయి. తొలుత ఈ కూటమిపై అఖిలేష్ యాదవ్ తన అసంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లో సీట్ల పంపకంపై కాంగ్రెస్‌తో నెలకొన్న వివాదమే అందుకు కారణం. ఆ తర్వాత నితీశ్ కుమార్ కూడా మండిపడ్డారు. ఇప్పుడు జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సైతం ఈ కూటమిపై ప్రశ్నలు లేవనెత్తారు.

ఇండియా కూటమిలో భాగమైన ‘నేషనల్ కాన్ఫరెన్స్’ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకం విషయంపై పొత్తు లేనప్పుడు.. దాన్ని ముందుగానే స్పష్టం చేసి ఉండాల్సింది. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉంటుందా? అనే ప్రశ్న ఇండియా కూటమి సమావేశాల్లో పదేపదే తలెత్తింది. కానీ.. దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫలితంగా.. మధ్యప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో కూటమిలోని పార్టీలు పరస్పరం పోట్లాడుకుంటున్నాయి’’ అని అన్నారు. కేవలం లోక్‌సభ ఎన్నికల కోసమే పొత్తు పెట్టుకున్నట్లు కాంగ్రెస్ చెబుతోందని ఆయన పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత అందరూ కూర్చొని ఒకసారి కూర్చొని విభేదాల్ని తొలగించుకోవాలని సూచించారు. ఫలితంగా.. లోక్‌సభ ఎన్నికల్లో మన పనితీరు బాగుంటుందని చెప్పారు.


కాంగ్రెస్ ఏం చెప్పింది?

అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకం వ్యవహారంలో నెలకొన్న విభేదాల నేపథ్యంలో.. ఎన్నికలు ముగిశాక అందరూ కలిసి సమావేశం అవుతామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విలేకరులతో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి 27, 28 పార్టీలు ఏకం కావాలని నిర్ణయించుకున్నాయని అన్నారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అన్ని పార్టీల వారు బిజీగా ఉన్నారని, ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే అందరం కలిసి మరోసారి సమావేశం అవుతామని పేర్కొన్నారు. ఆ సమావేశంలోనే తమ మధ్య నెలకొన్న దూరాన్ని తొలగించుకుంటామని స్పష్టం చేశారు.

గతంలో అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలేంటి?

ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని, చిన్న పార్టీలు దాని మిత్రపక్షాలుగా మారడం ఆ పార్టీకి ఇష్టం లేదని అఖిలేష్ యాదవ్ ఆరోపణలు చేశారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ రెండూ ప్రభుత్వాల్ని ఏర్పాటు చేశాయని.. కానీ పేదలు, రైతుల సమస్యలు మాత్రం మారలేదని అన్నారు. నేటికీ పేదరికం, ఆకలి, నిరుద్యోగం ఉన్నాయన్న ఆయన.. ఆ రెండు పార్టీలతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మధ్యప్రదేశ్ సీట్ల పంపక వ్యవహారంపై స్పందిస్తూ.. కాంగ్రెస్ తమకు ముందుగానే దూరమై మంచి జరిగిందని, లేకపోతే తన పార్టీ నేతలు చాలామంది నామినేషన్లు దాఖలు చేయకుండా ఉండేవాళ్లని అన్నారు.

నితీశ్ కుమార్ ఏం మాట్లాడారు?

బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ కూడా ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్‌ ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ మరోసారి సమావేశం కానుందని తెలిపారు. ఈ వ్యాఖ్యల అనంతరం ఆయన కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేతో ఫోన్‌లో మాట్లాడి భవిష్యత్‌ వ్యూహంపై చర్చించారు. అటు.. బీజేపీ సైతం ఇండియా కూటమిపై విమర్శలు గుప్పించింది. ఢిల్లీలో స్నేహం సాగుతోంది కానీ, రాష్ట్రాల్లో కుస్తీ నడుస్తోందని.. వారి నాటకం ఎక్కువ కాలం సాగదని ఇటీవల మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-11-07T19:43:10+05:30 IST