H3N2 influenza virus: ఫ్లూతో బెంబేలు

ABN , First Publish Date - 2023-03-11T02:54:59+05:30 IST

కరోనా మహమ్మారి మిగిల్చిన చేదు జ్ఞాపకాలను ఇంకా మరవకముందే.. దేశంలో హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ వ్యాప్తి కలవరపెడుతోంది. ఓవైపు ఆరోగ్యరంగ నిపుణులు ఈ వైర్‌సతో ఆందోళన చెందాల్సిన పనిలేదని చెబుతున్నప్పటికీ..

H3N2 influenza virus: ఫ్లూతో బెంబేలు

వైరస్‌.. వణుకు

హెచ్‌3ఎన్‌2 వైరస్‌తో ఇద్దరి మృతి

కర్ణాటక, హరియాణాలో మరణాలు

అధికారికంగా ధ్రువీకరించిన కేంద్ర ప్రభుత్వం

ఆరుగురు చనిపోయారన్న జాతీయ మీడియా

ఆందోళన కలిగిస్తున్న ఇన్‌ఫ్లుయెంజా-ఏ వైరస్‌

ఈ ఏడాదిలో 451 హెచ్‌3ఎన్‌2 కేసులు

అప్రమత్తంగా ఉండాలి.. కేంద్రం సూచన

మార్చి చివరికి వ్యాప్తి తగ్గుతుందని అంచనా

బెంగళూరు, న్యూఢిల్లీ, మార్చి 10: కరోనా మహమ్మారి మిగిల్చిన చేదు జ్ఞాపకాలను ఇంకా మరవకముందే.. దేశంలో హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ వ్యాప్తి కలవరపెడుతోంది. ఓవైపు ఆరోగ్యరంగ నిపుణులు ఈ వైర్‌సతో ఆందోళన చెందాల్సిన పనిలేదని చెబుతున్నప్పటికీ.. రెండు నెలలుగా విపరీతంగా పెరుగుతున్న కేసులతోపాటు మరణాలు కూడా నమోదవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇన్‌ఫ్లుయెంజా-ఏ ఉపరకమైన హెచ్‌3ఎన్‌2 వైరస్‌ కారణంగా భారత్‌లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ తొలిసారిగా ధ్రువీకరించింది. కర్ణాటక, హరియాణ రాష్ట్రాల్లో ఈ మరణాలు నమోదైనట్టు పేర్కొంది. కాగా, భారత్‌లో హెచ్‌3ఎన్‌2 మరణాలు నమోదవడం ఇదే తొలిసారి. అయితే ఓ జాతీయ మీడియా మాత్రం హెచ్‌3ఎన్‌2 కారణంగా మొత్తం ఆరుగురు మరణించారని నివేదించింది. కానీ, వారి వివరాలను మాత్రం వెల్లడించలేదు.

కర్ణాటకకు చెందిన 82 ఏళ్ల వృద్ధుడు హెచ్‌3ఎన్‌2 వైర్‌సతో మృతిచెందారు. హసన్‌ జిల్లాకు చెందిన హీరె గౌడ (82) గత నెల 24న ఆస్పత్రిలో చేరగా.. ఈనెల 1న మృతిచెందారు. శాంపిల్స్‌ను పరీక్షించగా ఆయన హెచ్‌3ఎన్‌2 వైర్‌సతో చనిపోయినట్టు ఈ నెల 6న నిర్ధారణ అయింది. అలాగే హరియాణకు చెందిన 56 ఏళ్ల వ్యక్తి కూడా హెచ్‌3ఎన్‌2 వైర్‌సతో మరణించినట్టు అధికారులు శుక్రవారం నిర్ధారించారు. ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన గత నెల 8న మరణించారు. శాంపిల్స్‌ను పరీక్షించగా ఆయనకు హెచ్‌3ఎన్‌2 పాజిటివ్‌గా తేలినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

గత రెండు మూడు నెలలుగా ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. ఇతర సబ్‌ వేరియంట్లతో పోల్చితే హెచ్‌3ఎన్‌2 రకం కారణంగా ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. చిన్నారులు, వృద్ధులపై ఈ వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఈ వైరస్‌ ప్రధాన లక్షణాల దగ్గు, జ్వరం. శ్వాస పీల్చుకోవడంలో సమస్యలు, ఒళ్లు నొప్పులు, వికారం, వాంతులు, గొంతునొప్పి, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. హెచ్‌3ఎన్‌2 అనేది మానవేతర ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌. ఇది సాధారణంగా పందుల్లో వ్యాపిస్తుందని, ఇది ప్రస్తుతం మనుషులకూ సోకిందని అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ డిసీజెస్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) తెలిపింది. ఇన్‌ఫ్లుయెంజా-ఏ అనే ఈ వైరస్‌ పరివర్తన చెందడంతోపాటు ప్రజల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల కేసులు పెరుగుతున్నాయని ఎయిమ్స్‌-ఢిల్లీ మాజీ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా వెల్లడించారు. ఇన్‌ఫ్లుయెంజా-ఏ ఉపరకమైన హెచ్‌3ఎన్‌2 వైరస్‌ కారణంగా ఆస్పత్రుల్లో చేరికలు పెరిగాయని ఐసీఎంఆర్‌ తెలిపింది. వ్యాధి లక్షణాలున్న వారు స్వీయ వైద్యం, యాంటీబయాటిక్స్‌ వాడకాన్ని మానుకోవాలని, వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచించింది. జ్వరం, ఒళ్లు నొప్పులు ఉన్నవారు పారాసెటమాల్‌ వాడొచ్చని తెలిపింది. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒసెల్టామివిర్‌ ఔషధాన్ని సిఫారసు చేసింది.

నిశితంగా గమనిస్తున్నాం: కేంద్రం

ఫ్లూ జ్వరాలకు కారణమవుతున్న హెచ్‌3ఎన్‌2 వైరస్‌ వ్యాప్తి తీరుని నిశితంగా గమనిస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇంటిగ్రేటెడ్‌ సర్వేలెన్స్‌ ప్రోగ్రామ్‌ (ఐడీఎ్‌సపీ) నెట్‌వర్క్‌ ద్వారా రాష్ట్రాల్లోని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని శుక్రవారం ప్రకటించింది. ఈ నెలాఖరు నాటికి కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పేర్కొంది. ఫ్లూ కేసులు పెరుగుతున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ రాష్ట్రాలను కోరారు. కేంద్ర ఆరోగ్య శాఖ వద్ద ఉన్న డేటా ప్రకారం దేశవ్యాప్తంగా హెచ్‌3ఎన్‌2తో పాటు ఇతర ఇన్‌ఫ్లుయెంజాకు సంబంధించి జనవరిలో 1,245, ఫిబ్రవరిలో 1,307, మార్చి (9వ తేదీ వరకు) 486 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి 2 నుంచి మార్చి 5 వరకు దేశంలో మొత్తం 451 హెచ్‌3ఎన్‌2 కేసులు నమోదైనట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

భయపడాల్సిన పనిలేదు: నిపుణులు

దేశంలో హెచ్‌3ఎన్‌2 మరణాలు నమోదుకావడంతో ఈ వైరస్‌పై పర్యవేక్షణ, ముందు జాగ్రత్త చర్యలు పెంచాలని ఆరోగ్య రంగ నిపుణులు సూచించారు. అయితే ప్రజలు భయపడాల్సిన పనిలేదని పేర్కొన్నారు. 5 శాతం కేసులు మాత్రమే ఆస్పత్రిలో చేరినట్టు నివేదికలు చెబుతున్నాయని తెలిపారు. అయితే సాధారణంగా వచ్చే ఫ్లూ కంటే హెచ్‌3ఎన్‌2 వైరస్‌ తీవ్రంగానే ఉంటుందని, అశ్రద్ధ చేస్తే మరణానికి దారితీసే ప్రమాదం ఉందని ప్రముఖ పల్మనాలజిస్ట్‌ అనురాగ్‌ అగర్వాల్‌ తెలిపారు. అయితే కొవిడ్‌లాగా భారీ వేవ్‌ వస్తుందని ఊహించలేమన్నారు.

వైరస్‌ను అరికట్టాలంటే...

రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలి.

తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

భౌతిక దూరం పాటించాలి.

దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు చేతులు అడ్డంగా పెట్టుకోవాలి.

జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లకూడదు.

Updated Date - 2023-03-11T04:44:28+05:30 IST