Tricolor hoisted in JK: త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన హిజ్బుల్ టెర్రరిస్టు తమ్ముడు
ABN , First Publish Date - 2023-08-14T14:42:29+05:30 IST
స్వాతంత్ర్య దినోత్సవానికి యావద్దేశం సిద్ధమవుతుండగా కశ్మీర్‌లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది జావెద్ మట్టూ సోదరుడు రయీస్ మట్టూ సోపోర్‌లోని తన నివాసం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
సోపోర్: స్వాతంత్ర్య దినోత్సవానికి (Independene Day) యావద్దేశం సిద్ధమవుతుండగా కశ్మీర్‌లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది జావెద్ మట్టూ (Javed Mattoo) సోదరుడు రయీస్ మట్టూ (Rayees Mattoo) సోపోర్‌లోని తన నివాసం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. భారతీయులుగా తాము గర్వపడతామని, ఎప్పటికీ భారతీయులుగానే ఉంటామని ఆయన చెప్పిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కశ్మీర్ లోయలో భద్రతా సంస్థలు గాలిస్తున్న టాప్-10 ఉగ్రవాదుల జాబితాలో జావెద్ మట్టూ ఉన్నాడు.
త్రివర్ణ పతాకం ఎగురవేయడం గర్వకారణంగా భావిస్తున్నానని, బహిర్గత శక్తుల ప్రభావం తమపై లేదని రయీస్ మట్టూ తెలిపారు. ఈ ప్రాంతంలో (కశ్మీర్) సానుకూల అభివృద్ధిని పరిగణలోకి తీసుకుని తన సోదరుడు కూడా పునఃపరిశీలన చేయాలని, ఎంచుకున్న మార్గం నుంచి వెనక్కి రావాలని కోరారు. పాకిస్థాన్‌పై విమర్శలు గుప్పిస్తూ, తాము ఎప్పుడూ భారతీయులుగానే గుర్తింపు పొందామని, భారతీయులుగానే కొనసాగుతామని నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేశారు.
''సహజమైన భావోద్వేగంతోనే జాతీయ జెండాను ఎగురవేస్తున్నాను. ఇది పూర్తిగా ఐచ్ఛికం. ఎవరి ప్రభావానికి లొంగేది లేదు. మా భూమి భరతభూమి. ప్రపంచంలోని అన్నింటికంటే మాతృభూమి మాకు మిన్న. ఇక్కడే పుట్టిపెరిగాం. ఇక్కడి అంoమైన ప్రకృతి, తోటలతో మమేకమవుతాం. ఇక్కడ ప్రగతి, పురోగతి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఆగస్టు 14న నాకు చాలా ప్రత్యేకం. నా షాపు తెరిచాను. గతంలో రాజకీయ శక్తుల వల్ల ఇక్కడ అభివృద్ధికి అనేక అవరోధాలు తలెత్తేవి. 2009లో నా సోదరుడు తాను ఎంచుకున్న మార్గంలో వెళ్లిపోయాడు. అప్పట్నించి సమాచారం లేదు. ఇప్పటికీ నా సోదరుడు బతికి ఉంటే, తన ఆలోచనను మార్చుకుని తిరిగి రావాలని కోరుకుంటున్నాను. పరిస్థితులు మారాయి. పాకిస్థాన్ శక్తిహీనం అయింది. మేము నిజమైన భారతీయులుగా మా మాతృభూమిలోనే జీవనం సాగిస్తాం'' అని రయీస్ మట్టూ తెలిపారు.