Parliament Monsoon session: లోక్‌సభ నిరవధిక వాయిదా
ABN , First Publish Date - 2023-08-11T15:21:12+05:30 IST
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో గంగా లోక్‌సభ శుక్రవారంనాడు నిరవధికంగా వాయిదా పడింది. సభ నిరవధిక వాయిదాను స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. జూలై 20న ప్రారంభమైన లోక్‌సభ వర్షాకాల సమావేశాల్లో 17 సార్లు సభ సమావేశమైందని, 44 గంటల 15 నిమిషాలు సభ పనిచేసిందని ఆయన వివరించారు.
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో (Parliament Monsoon session) భాగంగా లోక్‌సభ (Loksabha) శుక్రవారంనాడు నిరవధికంగా వాయిదా పడింది. సభ నిరవధిక వాయిదాను స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. జూలై 20న ప్రారంభమైన లోక్‌సభ వర్షాకాల సమావేశాల్లో 17 సార్లు సభ సమావేశమైందని, 44 గంటల 15 నిమిషాలు సభ పనిచేసిందని ఆయన వివరించారు. 20 బిల్లులను సభలో ప్రవేశపెట్టగా, 22 బిల్లులను సభ ఆమోదించినట్టు చెప్పారు. సభాకార్యక్రమాలు సజావుగా సాగేందుకు సహకరించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అన్ని పార్టీల నేతలు, ఎంపీలకు ఓం బిర్లా కృతజ్ఞతలు తెలిపారు.
సభా కార్యక్రమాల్లో భాగంగా జూలై 26న కేంద్రంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని విపక్షాలు ప్రవేశపెట్టగా స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. దీనిపై మూడు రోజుల పాటు చర్చ జరిగింది. 60 మంది సభ్యులు చర్చలో పాల్గొన్నారు. అనంతరం మూజువాణి ఓటుతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. తీర్మానంలో భాగంగా మణిపూర్ హింసతో సహా పలు అంశాలపై అధికార, విపక్ష సభ్యులు తమ వాదనలతో సభను హోరెత్తించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడం ఇది రెండోసారి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక క్యాటగిరి హోదా కల్పించే విషయమై మోదీ ప్రభుత్వంపై తొలిసారి 2018లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా, ఆ తీర్మానం వీగిపోయింది.