G20 Summit: ప్రపంచ జీవ ఇంధన కూటమి ఏర్పాటు.. జీ20 సమ్మిట్‌లో మోదీ కీలక ప్రకటన
ABN , First Publish Date - 2023-09-09T20:10:02+05:30 IST
భారతదేశంలో ఢిల్లీ వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న జీ20 సమావేశాల్లో భాగంగా ప్రధాని మోదీ మరో కీలక ప్రకటన చేశారు. పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలిపేలా చొరవ తీసుకోవాలని పిలుపునిస్తూ..
భారతదేశంలో ఢిల్లీ వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న జీ20 సమావేశాల్లో భాగంగా ప్రధాని మోదీ మరో కీలక ప్రకటన చేశారు. పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలిపేలా చొరవ తీసుకోవాలని పిలుపునిస్తూ.. ప్రపంచ జీవ ఇంధన కూటమిని ఏర్పాటు చేస్తున్నట్టు మోదీ ప్రకటించారు. జీవ ఇంధనాల విషయంలో అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయడం తక్షణ అవసరం ఉందని అన్నారు. క్లీన్ ఫ్యూయల్‌ని ప్రోత్సాహించేందుకు.. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్లో 20 శాతం వరకు ఇథనాల్ మిశ్రమాన్ని కలపాలని తాము ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. ఒకవేళ ఇది కుదరకపోతే.. సరికొత్త ప్రత్యామ్నాయ మిశ్రమాన్ని అభివృద్ధి చేసేందుకు మనం ప్రయత్నించవచ్చన్నారు.
అలా జరిగితే.. పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతూనే, ఇంధన సరఫరాకు లోటు లేకుండా చూడటం సాధ్యమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పర్యావరణంలో మార్పులు సంభవిస్తున్న నేపథ్యంలో.. ఇంధన పరివర్తన సాధించడం 21వ శతాబ్దానికి అత్యంత కీలకమని చెప్పారు. సమ్మిళిత ఇంధన పరివర్తన కోసం ట్రిలియన్లకొద్దీ వ్యయం అవుతుందన్నారు. పర్యావరణం కోసం 100 బిలియన్ డాలర్లు వెచ్చించేందుకు తాము తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అభివృద్ధి చెందిన దేశాలు ప్రకటించాయని.. ఈ మేరకు అవి సానుకూల చొరవ తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయమని వెల్లడించారు. ఈ కూటమిలో జీ20 సభ్యులంతా భాగం కావాల్సిందిగా మోదీ ఆహ్వానించారు. ఈ సరికొత్త కూటమిలో అమెరికా, కెనడా, బ్రెజిల్‌తో పాటు 15కు పైగా దేశాలు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాగా.. 2009లో నిర్వహించిన ఐక్యరాజ్య సమితి పర్యావరణ సదస్సులో పర్యావరణ మార్పులను ఎదుర్కోవడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఏటా 100 బిలియన్ డాలర్లు చొప్పున 100 బిలియన్ డాలర్లు ఇస్తామని అభివృద్ధి చెందిన దేశాలు హామీ ఇచ్చాయి. కానీ.. ఆ హామీని అవి నిలబటెట్టుకోలేకపోయాయి. ఇదిలావుండగా.. వ్యవసాయ ఉత్పత్తులు, సేంద్రీయ వ్యర్థాల ద్వారా తయారయ్యే ఇంధనాలను ‘జీవ ఇంధనం’ అంటారు. ఇథనాల్, బయోడీజిల్, బయోగ్యాస్ మొదలైనవి జీవ ఇంధనాలుగా ప్రాచుర్యం పొందాయి. వీటిని వాహనాలు, షిప్పింగ్, విమానయానం కోసం ఉపయోగించనున్నారు. జీవఇంధనంతో కర్బన ఉద్గారాల విడుదల చాలా తక్కువగా ఉంటుంది. స్థానికంగా సాగుచేసిన పంటలను జీవ ఇంధనం తయారీకి ఉపయోగిస్తే.. ఉపాధి అవకాశాలతో పాటు ఇంధన భద్రతకు తోడ్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.