PM Narendra Modi: నవంబర్ చివర్లో జీ20 వర్చువల్ సమావేశం.. ప్రధాని మోదీ ప్రతిపాదన

ABN , First Publish Date - 2023-09-10T18:53:57+05:30 IST

ఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సమావేశాలు ఆదివారం ముగిసిన నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోదీ ఒక ప్రతిపాదన..

PM Narendra Modi: నవంబర్ చివర్లో జీ20 వర్చువల్ సమావేశం.. ప్రధాని మోదీ ప్రతిపాదన

ఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సమావేశాలు ఆదివారం ముగిసిన నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోదీ ఒక ప్రతిపాదన చేశారు. ఈ సదస్సులో చేసిన తీర్మానాలు, సిఫార్సులు, ఇతర నిర్ణయాలను సమీక్షించడానికి నవంబర్ చివర్లో జీ20 వర్చువల్ సెషన్‌ను నిర్వహించాలని దేశాధినేతలకు సూచించారు. నవంబర్ 30వ తేదీ వరకు జీ20కి భారత నాయకత్వం కొనసాగుతుందని, ఈ రెండు నెలల సమయంలో మరిన్ని కార్యకలాపాలు పూర్తి చేయొచ్చని ఆయన ఆకాంక్షించారు.


‘‘జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా గత రెండు రోజుల్లో మీరు మీ అభిప్రాయాల్ని పంచుకున్నారు. సూచనలతో పాటు అనేక ప్రతిపాదనలు అందించారు. వాటన్నింటినీ నిశితంగా పరిశీలించి, వాటిని ఎలా వేగవంతం చేయాలో చూడాల్సిన కర్తవ్యం భారత్‌దే’’ అని ప్రధాని మోదీ చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘నవంబర్ చివర్లో మరో జీ20 వర్చువల్ సెషన్ నిర్వహించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. ఈ వర్చువల్ సెషన్‌లో.. జీ20 సదస్సులో అంగీకరించిన అంశాలను మనం సమీక్షించవచ్చు. అందుకు సంబంధించిన వివరాలు మా బృందాలు వివరిస్తాయి. ఈ వర్చువల్ సెషన్‌లో మీరందరూ పాల్గొంటున్నానని ఆశిస్తున్నాను’’ అంటూ చెప్పుకొచ్చారు.

ఇంతటితో జీ20 సమ్మిట్ ముగిసిందని తెలిపిన ప్రధాని మోదీ.. ముగింపు సందర్భంగా ఒక సంస్కృత శ్లోకాన్ని చదివారు. ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆశలు చిగురించి, శాంతి నెలకొనాలని ప్రార్థించారు. వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ అనే రోడ్ మ్యాప్ ఆనందంగా ఉంటుందని ఆశిస్తున్నానన్నారు. అనంతరం.. జీ20 తదుపరి అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సల్వాకు మోదీ అప్పగించారు. జీ20 అధ్యక్ష పదవిని స్వీకరించిన అనంతరం.. జీ20 సదస్సుని సమర్థవంతంగా నడిపినందుకు, అద్భుతమైన పని చేసినందుకు ప్రధాని మోదీని బ్రెజిల్ అధ్యక్షుడు అభినందించారు.

Updated Date - 2023-09-10T18:53:57+05:30 IST