PM Modi: థ్యాంక్యూ దుబాయి.. శిఖరాగ్ర సమావేశం తరువాత ఎక్స్‌లో అనుభవాలు పంచుకున్న మోదీ
ABN , First Publish Date - 2023-12-02T09:29:17+05:30 IST
దుబాయి(Dubai)లో వాతావరణ శిఖరాగ్ర సమావేశం అనంతరం గత రాత్రి ప్రధాని మోదీ(PM Modi) ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా దుబాయిలో జరిగిన కీలక చర్చల అనుభవాలను ప్రధాని ఎక్స్(X)లో పంచుకున్నారు.
ఢిల్లీ: దుబాయి(Dubai)లో వాతావరణ శిఖరాగ్ర సమావేశం అనంతరం గత రాత్రి ప్రధాని మోదీ(PM Modi) ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా దుబాయిలో జరిగిన కీలక చర్చల అనుభవాలను ప్రధాని ఎక్స్(X)లో పంచుకున్నారు. సంబంధిత వీడియోను షేర్ చేశారు. దుబాయ్ COP28 సమ్మిట్ సందర్భంగా, ప్రధాని మోదీ కింగ్ చార్లెస్ IIIతో సమావేశమయ్యారు.
వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా కింగ్ చార్లెస్ పోరాడుతున్నారని మోదీ అన్నారు. దుబాయిలో ఆయన వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్(World Climate Action Summit) ఈవెంట్స్‌లో పాల్గొన్నారు. నాలుగు చోట్ల దౌత్య పరమైన అంశాలపై ప్రసంగించారు.
ఆ తరువాత అక్కడి పారిశ్రామిక వేత్తలు, ప్రతినిధులు, ఉన్నతాధికారులతో కూడిన ఏడు ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొన్నారు. యూఏఈతో భాగస్వామ్య ఒప్పందం చేసుకోవడం వల్ల ఇంధన రంగంలో భద్రతతో పాటూ, బలాన్ని పెంచుకోవచ్చు అని ప్రధాని తెలిపారు.
గ్లోబల్ సోలార్ ఫెసిలిటీకి మద్దతు ఇవ్వడం వల్ల ఒకరి బలాన్ని ఒకరు పెంపొందించుకునేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా భారత్, యూఏఈ(UAE)లు మంచి సుసంపన్నమైన భవిష్యత్తుకు బాటలు వేసేందుకు దోహదపడుతుందన్నారు.
ఇరు దేశాలు ఇంధన రంగంలో చేతులు కలపడం ద్వారా రీ ప్రొడక్టివ్ శక్తిని ప్రోత్సహించేందుకు వీలు పడుతుందని చెబుతూ.. యూఏఈలో తాను ఆరో సారి పర్యటిస్తున్నట్లు చెప్పారు. అభివృద్ది చెందుతున్న దేశాలు ఏవైనా సమస్యల్లో ఉంటే వాటిని పరిష్కరించడంలో భాగం కావాలని, దీనికి తాను సుముఖంగా ఉన్నట్లు వెల్లడించారు.
అందులో భాగంగా అవసరమైన ఆర్థిక, సాంకేతికతను ఒకరికొకరు అందిపుచ్చుకోవాలని కోరారు."మెరుగైన భూగోళం కోసం పని చేయడానికి ప్రపంచ దేశాలు కృషి చేయాలి. కాప్-28 సదస్సులో ప్రపంచ దేశాధినేతలతో వాతావరణ మార్పులకు సంబంధించి చర్చలు జరిగాయి. పర్యావరణ పరిరక్షణ కోసం ఉమ్మడి కార్యాచరణ రూపొందించాం" అని ప్రధాని అన్నారు. దుబాయి పర్యటనలో ఆయన వియత్నం ప్రధాని ఫామ్ మిన్ చిన్హ్ తదితరులను కలిశారు.