PM Narendra Modi: ఈజిప్టు అధ్యక్షుడితో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ.. ఆ అవసరాలపై పరస్పర అంగీకారం
ABN , First Publish Date - 2023-10-29T18:47:48+05:30 IST
ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో.. భారత ప్రభుత్వం ఈ అంశంపై అనుబంధ దేశాలతో టచ్‌లో ఉంటూ, ఆయా పరిస్థితులపై చర్చలు జరుపుతోంది. ఇప్పటికే ప్రధాని మోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్...
ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో.. భారత ప్రభుత్వం ఈ అంశంపై అనుబంధ దేశాలతో టచ్‌లో ఉంటూ, ఆయా పరిస్థితులపై చర్చలు జరుపుతోంది. ఇప్పటికే ప్రధాని మోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు, పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్, జోర్డాన్ కింగ్ అబ్దులా II తో ఫోన్‌లో మాట్లాడారు. ఇప్పుడు తాజాగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ అల్-సీసీతో ఫోన్‌లో మాట్లాడారు. పశ్చిమాసియాలో రోజురోజుకీ దిగజారుతున్న పరిస్థితులు, మానవతా సంక్షోభం, ఉగ్రవాదం, సామాన్య పౌరుల మరణాలపై ఆయనతో మాట్లాడినట్లు ట్విటర్ మాధ్యమంగా ప్రధాని మోదీ తెలిపారు.
‘‘శనివారం ఈజిప్టు అధ్యక్షుడు అల్-సీసీతో ఫోన్‌లో మాట్లాడటం జరిగింది. పశ్చిమాసియాలో క్షీణిస్తున్న భద్రత, మానవతా పరిస్థితులపై పరస్పర అభిప్రాయాలను పంచుకున్నాం. తీవ్రవాదం, హింస, పౌర ప్రాణనష్టంపై ఆందోళనలు వ్యక్తం చేశాం. పశ్చిమాసియాలో వెంటనే శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించి, స్థిరత్వాన్ని సాధించాల్సిన అవసరం ఉందని పరస్పర అంగీకారానికి వచ్చాం’’ అని మోదీ ట్వీట్ చేశారు. అలాగే.. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం వల్ల ప్రభావితమైన బాధితులకు మానవతా సాయం అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అటు.. ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణపై ఈజిప్టు అధ్యక్ష కార్యాలయ ప్రతినిధి కూడా స్పందించారు. గాజాలో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలపైనా ఇరువురు నేతలు చర్చించారన్నారు. పరిస్థితులు మరింత దిగజారడం వల్ల వచ్చే ముప్పుపై కూడా ఇద్దరు చర్చించారని పేర్కొన్నారు. సామాన్య పౌరుల జీవితాలు, ప్రాంతీయ భద్రతపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండనుందన్న అంశాలపై కూడా చర్చలు జరిపినట్టు వెల్లడించారు.
ఇదిలావుండగా.. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఏకంగా 5 వేలకు పైగా రాకెట్లతో మెరుపుదాడులు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. భూమి, వాయు, జల మార్గాల ద్వారా హమాస్ యోధులు ఇజ్రాయెల్‌లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. ఈ దాడిలో 1,400 మంది మరణించారు. ఇందుకు ప్రతీకారం ఇజ్రాయెల్ సైన్యం సైతం హమాస్ నియంత్రణలో ఉన్న గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఓవైపు వైమానిక దాడులు, మరోవైపు గ్రౌండ్ ఆపరేషన్స్‌తో.. హమాస్‌ని వెంటాడి వేటాడుతోంది. అయితే.. ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో వేలాదిమంది గాజా పౌరులు మరణించినట్టు హమాస్ చెబుతోంది.