PM Narendra Modi: ‘సిగ్గులేని వ్యాఖ్యలు చేశారు, ఇంకెంత దిగజారుతారు’.. నితీశ్ కుమార్‌పై ప్రధాని మోదీ ధ్వజం
ABN , First Publish Date - 2023-11-08T17:16:18+05:30 IST
మన భారతదేశంలో జనాభా గణనీయంగా పెరిగిపోతున్న తరుణంలో.. అప్పుడప్పుడు రాజకీయ నేతలు ‘జనాభా నియంత్రణ’పై తమ సూచనలు ఇస్తుంటారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా అదే పని చేశారు. కానీ..
PM Modi Slams Nitish Kumar: మన భారతదేశంలో జనాభా గణనీయంగా పెరిగిపోతున్న తరుణంలో.. అప్పుడప్పుడు రాజకీయ నేతలు ‘జనాభా నియంత్రణ’పై తమ సూచనలు ఇస్తుంటారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా అదే పని చేశారు. కానీ.. ఆయన మహిళల గౌరవానికి భంగం కలిగేలా అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. మహిళలు చదువుకున్నవారైతే గర్భం రాకుండా శృంగారం ఎలా చేయాలో తెలుస్తుందని.. అసెంబ్లీ సాక్షిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో.. ఆయనపై తారాస్థాయిలో విమర్శలు వచ్చిపడుతున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం నితీశ్ కుమార్‌పై నిప్పులు చెరిగారు.
బుధవారం మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన ప్రచార సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘ఇండియా కూటమికి చెందిన ఓ ప్రముఖ నాయకుడు (నితీశ్ కుమార్‌ని ఉద్దేశిస్తూ) అసెంబ్లీలో సిగ్గులేకుండా అసభ్య పదజాలం వాడారు. ఇండియా కూటమిలోని ఏ ఒక్క నాయకుడు కూడా ఆ వ్యాఖ్యల్ని ఖండించలేదు. వాళ్లు ఇంకెంత నీచంగా దిగజారిపోతారు. దేశాన్ని అవమానంపాలు చేస్తున్నారు. అసెంబ్లీలో తమ తల్లులు, చెల్లెళ్లు మధ్యే సిగ్గుమాలిన పదజాలాన్ని వాడారు. అసలు మహిళల గురించి ఆలోచించే పద్ధతి ఇదేనా? ఇలాంటి వాళ్లు దేశం కోసం పని చేయగలరా? అలాంటి వ్యక్తుల్ని మీరు (ప్రజలు) గౌరవించాలా?’’ అంటూ మండిపడ్డారు. అటు.. బీజేపీ సైతం 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఓటు వేసేటప్పుడు నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేసుకోవాలని కోరింది.
నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలేంటి?
ఇటీవల బిహార్‌లో నిర్వహించిన కులగణనకు సంబంధించిన నివేదికను నితీశ్ కుమార్ మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భర్తల చర్యల వల్లే జననాలు పెరిగాయని, అయితే చదువుకున్న మహిళలకు భర్తల్ని ఎలా నియంత్రించాలో తెలుసని, అందుకే జననాల రేటు తగ్గిందని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా చేసిన ఈ వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. అసెంబ్లీలో అలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, ఆయన మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడని, తక్షణమే తన పదవికి రాజీనామా చేసి వైద్యుడ్ని సంప్రదించాలని బీజేపీ ఫైర్ అయ్యింది. జాతీయ మహిళా కమిషన్ కూడా మండిపడింది. ఈ నేపథ్యంలోనే నితీశ్ క్షమాపణలు చెప్పారు. తన మాటలతో తప్పుడు సందేశం వెళ్లి ఉంటే, వాటిని వెనక్కు తీసుకుంటున్నానని చెప్పారు.