Sunrise On Moon: అప్పటివరకూ చీకట్లోనే చంద్రుడి దక్షిణ ధృవం.. మళ్లీ చంద్రుడిపై సూర్యుడు ఉదయించేది ఎప్పుడంటే..
ABN , First Publish Date - 2023-09-04T12:35:08+05:30 IST
చంద్రుడిపై ప్రయాణిస్తున్న చంద్రయాన్ 3 ప్రజ్ఞాన్ రోవర్ మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. తన అసైన్‌మెంట్‌ను పూర్తి చేసుకుని సురక్షితంగా పార్క్ చేయబడింది.
చంద్రుడిపై ప్రయాణిస్తున్న చంద్రయాన్ 3 ప్రజ్ఞాన్ రోవర్ మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. తన అసైన్‌మెంట్‌ను పూర్తి చేసుకుని సురక్షితంగా పార్క్ చేయబడింది. మిషన్‌లోని అన్ని పేలోడ్స్ ప్రస్తుతం స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. ఈ విషయాన్ని ఇస్రో తన అధికారిక ట్విటర్ (ఎక్స్) ఖాతా ద్వారా తెలిపింది. ‘‘ ప్రస్తుతం APXS, LIBS పేలోడ్‌లు ఆఫ్ చేయబడ్డాయి. ఈ పేలోడ్‌ల నుంచే సమాచారం ల్యాండర్ ద్వారా భూమికి ప్రసారం చేయబడుతుంది.’’ అని ఇస్రో ట్వీట్ చేసింది. ప్రస్తుతం చంద్రయాన్ 3 ప్రజ్ఞాన్ రోవర్ పూర్తి స్థాయిలో ఛార్జ్ అయిందని, రిసీవర్‌ను ఆన్‌లో ఉంచినట్లు తెలిపింది. సోలార్ ప్యానెల్ సెప్టెంబర్ 22న సూర్యోదయం సమయంలో కాంతిని స్వీకరిస్తుందని అంచనా వేస్తున్నట్లు ఇస్రో పేర్కొంది. దీంతో మరో అసైన్‌మెంట్ కోసం ప్రజ్ఞాన్ రోవర్ మరోసారి అందుబాటులోకి వస్తుందని ఇస్రో ఆశిస్తోంది. అంటే సెప్టెంబర్ 22 వరకు చంద్రుడి దక్షిణ ధృవం చీకట్లోనే ఉండనుంది. మళ్లీ సెప్టెంబర్ 22నే అక్కడ సూర్యుడు ఉదయించనున్నాడు. ఆ సూర్య కాంతిని ప్రజ్ఞాన్ రోవర్ సోలార్ ప్యానెల్ స్వీకరించి స్లీప్ మోడ్ నుంచి ఆన్ కానున్నాయి. ఒక వేళ అప్పటికీ ప్రజ్ఞాన్ రోవర్ ఆన్ అయి అందుబాటులోకి రాకపోతే భారతదేశ రాయబారిగా ఎప్పటికీ చంద్రుడిపైనే ఉండిపోతుందని ఇస్రో తెలిపింది.
కాగా చంద్రుడిపై ప్రజ్ఞాన్ రోవర్ ఇప్పటికే 100 మీటర్ల దూరం ప్రయాణించింది. జాబిల్లి ఉపరితలంపై కలియ తిరిగిన ప్రజ్ఞాన్ రోవర్ తన పరిశోధనల్లో సల్ఫర్‌తో పాటు ఆక్సిజన్ ఉనికిని గుర్తించిన సంగతి తెలిసిందే. రోవర్‌లోని లేజర్-ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెకో్ట్రస్కోప్ (లిబ్స్) పేలోడ్ దక్షిణ ధ్రువానికి సమీపంలోని చంద్రుడి ఉపరితలంపై సల్ఫర్ (ఎస్) ఉనికిని స్పష్టంగా గుర్తించినట్టు ఇస్రో వెల్లడించింది. సల్ఫర్‌తోపాటు అల్యూమినియం (ఏఎల్), కాల్షియం (సీఏ), ఇను ము (ఎఫ్‌ఈ), క్రోమియం (సీఆర్), టైటానియం (టీఐ), మాంగనీస్ (ఎంఎన్), సిలికాన్ (ఎస్‌ఐ), ఆక్సిజన్ (ఓ)లను కూడా లిబ్స్ గుర్తించిందని ఇస్రో తెలిపింది. ‘‘రోవర్‌లోని లిబ్స్ దక్షిణ ధ్రువానికి సమీపంలో జాబిల్లి ఉపరితలంపై సల్ఫర్ (ఎస్) ఉనికిని స్పష్టంగా గుర్తించింది. ఊహించినట్టుగానే అల్యూమినియం, కాల్షియం, ఫెర్రస్, క్రోమియం, టైటానియం, మాంగనీస్, సిలికాన్, ఆక్సిజన్‌లను కూడా గుర్తించింది.’ అని ఇస్రో ట్విటర్ (ఎక్స్)లో పోస్ట్ చేసిన విషయం విదితమే. చంద్రుని దక్షిణ ధ్రువంపై అరుదైన సల్ఫర్ జాడ కనిపించడం చాలా కీలకం. ఈ లిబ్స్ పరికరాన్ని బెంగళూరులోని లేబొరేటరీ ఫర్ ఆస్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్స్, ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.