PM MODI: యువతే మా సంపద!

ABN , First Publish Date - 2023-07-14T02:24:27+05:30 IST

భారతదేశ బలమైన సంపద యువతేనని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇతర దేశాల్లో వృద్ధుల సంఖ్య అపరిమితంగా పెరిగిపోతూ.. యువజనులు బాగా తగ్గిపోతున్న తరుణంలో భారత్‌లో యువజనులు, నైపుణ్య సిబ్బంది.. వచ్చే కొన్ని దశాబ్దాల్లో ప్రపంచానికి సంపదగా మారతారని పేర్కొన్నారు.

PM MODI: యువతే   మా సంపద!

నైపుణ్య సిబ్బంది భారత్‌ సొంతం

రాబోయే దశాబ్దాల్లో ప్రపంచంలో వారిదే హవా: మోదీ

గ్లోబల్‌ సౌత్‌, పశ్చిమ దేశాల నడుమ ఇండియా వారధి

ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వమివ్వాలి

ప్రపంచశాంతి కాముకులం.. ఫ్రాన్స్‌తో విస్తృత సహకారం

ఫ్రెంచ్‌ ఫైనాన్స్‌ పత్రిక ‘లెస్‌ ఎకోస్‌’కు ప్రధాని ఇంటర్వ్యూ

పారిస్‌, జూలై 13: భారతదేశ బలమైన సంపద యువతేనని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇతర దేశాల్లో వృద్ధుల సంఖ్య అపరిమితంగా పెరిగిపోతూ.. యువజనులు బాగా తగ్గిపోతున్న తరుణంలో భారత్‌లో యువజనులు, నైపుణ్య సిబ్బంది.. వచ్చే కొన్ని దశాబ్దాల్లో ప్రపంచానికి సంపదగా మారతారని పేర్కొన్నారు. గురువారం ఆయన ఫ్రెంచ్‌ ఫైనాన్షియల్‌ పత్రిక ‘లెస్‌ ఎకో్‌స’కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. స్వాతంత్య్రం సముపార్జించి వందేళ్లు పూర్తిచేసుకునే 2047లోపు భారత్‌ను అగ్ర దేశంగా నిలపడమే తమ లక్ష్యంగా పేర్కొన్నారు. గ్లోబల్‌ సౌత్‌ దేశాలైన.. ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, కరీబియన్‌, ఆసియా (ఇజ్రాయెల్‌, జపాన్‌, దక్షిణ కొరియా మినహా), ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మినహా ఓషియానా దేశాలకు.. పశ్చిమ దేశాలకు నడుమ భారత్‌ను వారధిగా అభివర్ణించారు. ‘భారత్‌ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం. విశ్వ యవనికపై సముచిత హక్కు కోరుకుంటోంది.

MO.jpg

ఇది ఐక్యరాజ్యసమితి విశ్వసనీయతకు సంబంధించిన విషయమే కాదు.. అత్యధిక జనాభా కలిగిన దేశానికి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భద్రతామండలిలో శాశ్వత సభ్య దేశం కాకపోతే.. ప్రపంచం తరఫున మాట్లాడుతున్నానని సదరు మండలి ఎలా చెబుతుంది? ప్రపంచ ఆర్థిక వృద్ధికి దోహదపడేందుకు భారత్‌ ముందు వరుసలో ఉంది. ప్రపంచ సవాళ్ల పరిష్కారంలో, పురోగామి ప్రపంచ నిర్మాణంలో, బలహీనుల ఆకాంక్షల వ్యక్తీకరణలో, శాంతి సామరస్యాల స్థాపనలో తన వంతు బాధ్యతను భారత్‌ గుర్తించింది. మేం ఎదిగేకొద్దీ ప్రపంచం ఎదుగుదలలో మా పాత్ర పెరుగుతుంది. మేమెప్పుడూ ప్రపంచ శాంతి, పురోభివృద్ధి కాముకులం’ అని అన్నారు.

అమెరికాతో బంధం ఉన్నత శిఖరాలకు..

భారత్‌-అమెరికా బంధం వేగం పుంజుకుందని.. గత తొమ్మిదేళ్లలో ఉన్నత శిఖరాలకు చేరుకుందని ప్రధాని అన్నారు. ద్వైపాక్షిక బంధాన్ని విస్తృతపరిచేందుకు అమెరికన్‌ కాంగ్రెస్‌ పార్టీలకతీతంగా అండగా నిలుస్తోంది. అమెరికా నాయకత్వంతో వ్యక్తిగతంగా నాకు సత్సంబంధాలు ఉన్నాయి. గత నెలలో అమెరికాలో నా అధికారిక పర్యటన సందర్భంగా.. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ప్రజాస్వామ్యాల నడుమ భాగస్వామ్యాన్ని.. ఈ శతాబ్దపు అత్యుత్తమ బంధంగా మలచాలని అధ్యక్షుడు జో బైడెన్‌, నేను నిర్ణయించాం. పరస్పర విశ్వానం, నమ్మకం ప్రస్తుత సత్సబంధాలకు మూలం’ అని వెల్లడించారు. ఇక ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, ప్రజా సంబంధాలను భారత్‌-ఫ్రాన్స్‌ వృద్ధి చేసుకుంటున్నాయని తెలిపారు. పరస్పర సహకారాన్ని విస్తృతపరిచేందుకు ఫ్రెంచ్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ పలు చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు.

నిరుడు పారిస్‌ బుక్‌ ఫేర్‌, కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌, వివాటెక్‌, పారిస్‌ ఇన్‌ఫ్రా వీక్‌, ఇంటర్నేషనల్‌ సీటెక్‌ వీక్‌-ఫ్రాన్స్‌లో భారత్‌ 2022 సంవత్సర దేశంగా నిలిచిందని గుర్తుచేశారు. రక్షణ బంధం శరవేగంగా పురోగమించిందని.. ఉమ్మడిగా డిజైన్‌, అభివృద్ధి సహా అసలైన పారిశ్రామిక భాగస్వామ్యాన్ని ప్రారంభించామని తెలిపారు. ‘అంతర్జాతీయ వేదికలపై సమన్వయ సహకారాలతో కలిసి పనిచేస్తున్నాం. ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలయెన్స్‌ను ఉభయులం కలిసి ప్రారంభించాం. ఉగ్రవాదానికి ఎవరూ నిధులు సమకూర్చరాదని చొరవ చూపిన దేశాల్లో భారత్‌, ఫ్రాన్స్‌ ముందున్నాయి. మేక్రాన్‌ ఆలోచనావిధానం మాతో సరిపోలుతోంది. కలిసి పనిచేయడానికి ఇది ఉపకరిస్తోంది. ఇందుకు ఆయనకు ధన్యవాదాలు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో శాంతిసుస్థిరతలకు మా భాగస్వామ్యం ఎంతో కీలకం’ అని వివరించారు.

పారిస్‌ చేరుకున్న మోదీ

న్యూఢిల్లీ, పారిస్‌, జూలై 13: రెండు రోజుల ఫ్రాన్స్‌ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గురువారం పారిస్‌ చేరుకున్నారు. ఆ దేశ ప్రధాని ఎలిజబెత్‌ బార్న్‌ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మోదీకి స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ఫ్రెంచ్‌ సెనేట్‌ అధ్యక్షుడు గెరార్డ్‌ లార్చర్‌తోనూ మోదీ సమావేశమయ్యారు. అనంతరం, ఫ్రాన్స్‌లో స్థిరపడిన భారతీయులు ఏర్పాటు చేసిన భేటీలో మోదీ ప్రసంగించారు. అహ్మదాబాద్‌లో 40 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఫ్రెంచి సాంస్కృతిక కేంద్రం ‘అలయన్స్‌ ఫ్రాంకయి్‌స’లో తాను సభ్వత్యం తీసుకున్న విషయాన్ని వెల్లడించారు. శుక్రవారం జరిగే ఫ్రాన్స్‌ జాతీయ దినోత్సవాల్లో (బాస్టిల్‌ డే) మోదీ గౌరవ అతిథిగా పాల్గొననున్నారు. భారత నౌకాదళం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణి విధ్వంసక నౌక ఐఎన్‌ఎస్‌ చెన్నై ఈ ఉత్సవాల్లో పాలుపంచుకోనుంది. దీంతోపాటు భారత త్రివిధ దళాలకు చెందిన 269 మంది సభ్యుల బృందం కూడా బాస్టిల్‌ డే కవాతులో పాల్గొననుంది.

భారత్‌-ఫ్రాన్స్‌ వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రస్తుత ఏడాదితో పాతికేళ్లు. కాగా, నౌకాదళం అవసరాలకు తగినట్లుగా ఉండే 26 రాఫెల్‌ యుద్ధవిమానాలను, మూడు స్కార్పియాన్‌ జలాంతర్గాములను ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేయటానికి భారత్‌ గురువారం ఆమోదం తెలిపింది. రూ.80,000-85,000 కోట్ల విలువైన ఈ భారీ ఒప్పందానికి రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధ్యక్షతన సమావేశమైన ‘రక్షణ సేకరణ మండలి’ (డీఏసీ) అంగీకరించింది. ప్రస్తుతం ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ, ఆ దేశాధ్యక్షుడు మక్రాన్‌తో చర్చలు జరిపిన అనంతరం శుక్రవారం ఈ కొనుగోలు ఒప్పందంపై ఇరుదేశాలు సంయుక్త ప్రకటన చేయనున్నాయి. హిందూ మహాసముద్రంలో చైనా ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో భారత నౌకాదళం శక్తిసామర్థ్యాలను పెంపొందించటంపై కేంద్రం దృష్టి పెట్టింది. దాంట్లో భాగంగానే ఈ కొనుగోలు ఒప్పందానికి ఆమోదం తెలిపింది.

Updated Date - 2023-07-14T02:24:27+05:30 IST