Odisha train tragedy: ఘోరప్రమాదానికి మూలకారణం, బాధ్యుల గుర్తింపు... రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ ప్రకటన...

ABN , First Publish Date - 2023-06-04T11:23:21+05:30 IST

భారత చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాల్లో ఒకటైన ఒడిశా రైలు దుర్ఘటనకు (Odisha train tragedy) మూలకారణాన్ని గుర్తించామని కేంద్ర రైల్వేమంత్రి అశ్వని వైష్ణవ్ ఆదివారం ప్రకటించారు. మూడు రైళ్లు ఢీకొన్న ప్రాంతాన్ని ఆదివారం మరోసారి ఆయన సందర్శించారు.

Odisha train tragedy: ఘోరప్రమాదానికి మూలకారణం, బాధ్యుల గుర్తింపు... రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ ప్రకటన...

బాలాసోర్: భారత చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాల్లో ఒకటైన ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటనకు (Odisha train tragedy) మూలకారణాన్ని గుర్తించామని కేంద్ర రైల్వేమంత్రి అశ్వని వైష్ణవ్ ఆదివారం ప్రకటించారు. ఎలక్ట్రిక్ ఇంటర్‌లాకింగ్‌లో మార్పు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంపై దర్యాప్తు పూర్తయ్యిందని చెప్పారు. బాధ్యులను కూడా గుర్తించామన్నారు. అయితే రైల్ సేఫ్టీ కమిషనర్ వీలైనంత త్వరగా ఈ రిపోర్ట్‌ను సమర్పిస్తారని, ప్రభుత్వానికి రిపోర్ట్ అందిన వెంటనే పూర్తి వివరాలు బయటకు వెల్లడిస్తామని మంత్రి చెప్పారు. కాగా మూడు రైళ్లు ఢీకొన్న ప్రాంతాన్ని ఆదివారం ఉదయం సందర్శించారు. ట్రాక్‌ల పునరుద్ధరణ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

రైల్వే ట్రాకుల పునరుద్ధరణను ఈ రోజే (ఆదివారం) పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం నాటికల్లా పనులన్నీ పూర్తి చేయాలనేదే తమ లక్ష్యమని, తద్వారా సర్వీసులు పునరుద్ధరణ అవుతాయని పేర్కొన్నారు. పనులను దగ్గరుండి తానే సమీక్షిస్తున్నానని ఆయన చెప్పారు. మరోవైపు మృతదేహాలన్నింటినీ ఇప్పటికే షిఫ్ట్ చేశామని చెప్పారు. ప్రమాదస్థలంలో యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, 1000 మందికిపైగా ఒడిశా కార్మికులు శ్రమిస్తున్నారని ఆయన తెలిపారు. కాగా పెద్ద సంఖ్యలో వర్కర్లతోపాటు 7 పొక్లెయిన్ మెషిన్లు, 2 యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్స్, 3-4 రైల్వే, రోడ్ క్రేన్స్‌లతో ముమ్మరంగా శ్రమిస్తున్నారు. ఇక అత్యంత విషాదకరమైన ఒడిశా రైలు ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య 288గా ఉంది. ఇక గాయపడిన వారి సంఖ్య 1100 దాటిందని సమాచారం. తాజా డేటా అందాల్సి ఉంది.

ఎన్నో అనుమానాలు..

కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ మెయిన్‌ లైన్‌లో వెళ్లేలా సిగ్నల్‌ సక్రమంగానే ఉంది. కోరమాండల్‌కు మెయిన్‌లైన్‌కు సిగ్నల్‌ ఉండగా... లూప్‌లైన్‌లోకి ఎలా వెళ్లిందనేదే ఇప్పుడు ప్రశ్నగా మారింది! విశ్వసనీయ సమాచారం ప్రకారం... పారాదీప్‌ నుంచి మెయిన్‌లైన్‌లో వెళ్తున్న ఒక గూడ్స్‌ను కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు దారి ఇవ్వడం కోసం బహనాగ్‌బజార్‌ స్టేషన్‌ వద్ద లూప్‌లైన్‌లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ‘లూప్‌లైన్‌’ను రెడ్‌లో ఉంచి... కోరమాండల్‌కు మెయిన్‌లైన్‌లో సిగ్నల్‌ ఇచ్చారు. ఈ ప్రక్రియను ‘త్రూ లైన్‌’ అంటారు. (తొలుత గూడ్స్‌కు మెయిన్‌లైన్‌లో ఇచ్చిన రెడ్‌ సిగ్నల్‌ను తీసేసి... తర్వాత వచ్చే కోరమాండల్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం. దీనినే...సిగ్నల్‌ గివెన్‌ అండ్‌ టేకెన్‌ ఆఫ్‌ అంటారు.) ఇలా సిగ్నల్‌ ఇచ్చినప్పుడు పట్టాలదగ్గర ఉన్న ‘పాయింట్‌’ మారిపోవాలి. (కదులుతున్న రైలును ఒక ట్రాక్‌ నుంచి మరో ట్రాక్‌పైకి మళ్లించడాన్నే ‘పాయింట్‌’ అంటారు.) కోరమాండల్‌ మెయిన్‌లైన్‌లో వెళ్లేలా ‘త్రూ’ కావాలి. కానీ... అలా జరగలేదు. సిగ్నల్‌ – పాయింట్‌ మధ్య లోపం తలెత్తింది. సిగ్నల్‌ బాగుంది కానీ... పాయింట్‌ మారకపోవడంతో, అప్పటికే గూడ్స్‌ వెళ్లిన లూప్‌లైన్‌లోకే కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ కూడా వెళ్లింది. బహనాగ్‌బజార్‌ రైల్వే స్టేషన్‌లోని డిజిటల్‌ సిగ్నల్‌ చార్ట్‌లో ఇదంతా నమోదైనట్లు విశ్వసనీయ సమాచారం. సిగ్నల్‌ ఇచ్చినా పాయింట్‌ ఎందుకు మారలేదనేదే ఇక్కడ ప్రశ్న! గతంలో పాయింట్‌ మార్చేందుకు రైల్వే సిబ్బంది లివర్‌ లాగాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరంలేదు. స్టేషన్‌ మాస్టర్‌ తన గదిలో కూర్చుని కంప్యూటర్‌పై మౌస్‌తో క్లిక్‌ చేస్తే... మోటర్‌ ఆన్‌ అయి, పాయింట్‌ను పుష్‌ చేస్తుంది. మరి... ఇక్కడ పాయింట్‌ ఎందుకు మారలేదు? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం విషయంలో డ్రైవర్‌ (పైలట్‌) పాత్రపైనా చర్చ జరుగుతోంది. గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే ముందుకు వెళ్లడం.. రెడ్‌ వస్తే ఆపడం.. నిర్దేశిత/సూచిత వేగంతో బండి నడపడం మాత్రమే పైలట్‌ పని. సిగ్నల్‌ ఇవ్వడం, పాయింట్‌ మార్చే బాధ్యత స్టేషన్‌ మాస్టర్‌దే.

Updated Date - 2023-06-04T13:01:59+05:30 IST