PSLV-C56 : విజయాశ్వం మరో హిట్
ABN , First Publish Date - 2023-07-31T02:33:49+05:30 IST
ఇస్రో(ISRO) విజయాశ్వం పీఎస్ఎల్వీ(PSLV) మరో హిట్టు కొట్టింది. సింగపూర్‌కు చెందిన ఏడు ఉపగ్రహాలతో రివ్వున ఎగిరిన పీఎస్ఎల్వీ-సీ56(PSLV-C56) రాకెట్ వాటిని విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి చేరవేసింది.
పీఎస్ఎల్వీ-సీ56 ప్రయోగం సక్సెస్
7 సింగపూర్ ఉపగ్రహాలతో నింగిలోకి
23.30 నిమిషాల్లో నిర్ణీత కక్ష్యలోకి
ఇస్రోకు మరో వాణిజ్య విజయం
సూళ్లూరుపేట, జూలై 30: ఇస్రో(ISRO) విజయాశ్వం పీఎస్ఎల్వీ(PSLV) మరో హిట్టు కొట్టింది. సింగపూర్‌కు చెందిన ఏడు ఉపగ్రహాలతో రివ్వున ఎగిరిన పీఎస్ఎల్వీ-సీ56(PSLV-C56) రాకెట్ వాటిని విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి చేరవేసింది. పీఎస్ఎల్వీ సీరీస్‌లో ఇస్రోకు ఇది 58వ ప్రయోగం కాగా.. వాటిలో ఇది 55వ విజయం కావడం విశేషం. ఆదివారం ఉదయం 6:31 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోట(Sriharikota) సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని ప్రథమ ప్రయోగ వేదిక నుంచి ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైంది. శనివారం ఉదయం 5:01 గంటలకు ప్రారంభమైన 25:31 గంటల కౌంట్‌డౌన్ పూర్తవగానే పీఎస్ఎల్వీ-సీ56 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగిరింది. తన నాలుగు దశలను సునాయసంగా పూర్తి చేసుకుని రాకెట్ శిఖర భాగాన 420 కిలోల బరువున్న ఏడు ఉపగ్రహాలను 535 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి విజయవంతంగా చేర్చింది. మొదట ప్రధాన ఉపగ్రహమైన డీఎస్-ఎస్‌ఏర్‌ను 19.30 నిమిషాలకు కక్ష్యలో విడిచిపెట్టింది. అనంతరం మరో 4 నిమిషాల వ్యవధిలోనే పేలోడ్‌లో ఉన్న వెలాక్స్ ఏఎం, ఆర్కేడ్, స్కూబ్-2, నులియన్, గెలాసియా-2, ఓఆర్‌బీ-12 అనే ఆరు చిన్న ఉపగ్రహాలను కూడా కక్ష్యలోకి చేర్చింది. ఈ మొత్తం వ్యవహారం 23.30 నిమిషాల్లోనే ముగిసింది. మిషన్ కంట్రోల్ సెంటర్‌లో సూపర్ కంప్యూటర్ల ద్వారా ప్రయోగాన్ని వీక్షిస్తున్న ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ రాకెట్ ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చిన వెంటనే పీఎ్‌సఎల్వీ-సీ56 ప్రయోగం విజయవంతమైందని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇస్రో ఖాతాలో ఈ ఏడాది ఇది మూడో వాణిజ్య విజయమని ప్రకటించారు.
ఇస్రోపై నమ్మకం పెట్టిన సింగపూర్ ప్రభుత్వానికి, ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్)కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రస్తుతం 535 కిలోమీటర్ల ఎత్తులోని వృత్తాకార కక్ష్యలో ఉన్న పీఎస్‌ఎల్వీ నాలుగో దశను తిరిగి 300 కిలోమీటర్ల దిగువ కక్ష్యలోకి తీసుకురానున్నట్టు చెప్పారు. తద్వారా అంతరిక్ష వ్యర్థాల సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియను ప్రయోగాత్మకంగా చేపడుతున్నట్టు పేర్కొన్నారు. సెప్టెంబరులో పీఎస్ఎల్వీ ద్వారా మరో వాణిజ్య ప్రయోగం ఉంటుందని సోమనాథ్ చెప్పారు. అదే విధంగా ఈ ఏడాది చివరిలోపు మరో నాలుగు ప్రయోగాలు చేపడతామన్నారు. కాగా, సింగపూర్‌కు చెందిన ఏడు ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించడం ఇరు దేశాల మధ్య అంతరిక్ష భాగస్వామ్యంలో కీలక మైలురాయి అని సింగపూర్‌లోని భారత హై కమిషన్ ట్వీట్ చేసింది.