Rahul helps Scooterist: పార్లమెంటులో అడుగు పెట్టేముందు రాహుల్ ఏం చేసారంటే..?... వీడియో వైరల్
ABN , First Publish Date - 2023-08-09T15:58:05+05:30 IST
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారంనాడు పార్లమెంటుకు బయలుదేరుతుండగా జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. రహదారిపై ఓ స్టూటిరిస్టు కింద పడిపోవడంతో రాహుల్ కారు ఆపి ఆయనను లేవదీశారు. అనంతరం పార్లమెంటుకు బయలుదేరి వెళ్లారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తిరిగి లోక్‌సభ సభ్యత్వం పొందిన తర్వాత కేంద్రంపై అవిశ్వాస తీర్మానం చర్చలో బుధవారంనాడు పాల్గొని ప్రసంగించారు. దీనికి ముందు ఆయన పార్లమెంటుకు బయలుదేరుతుండగా జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
రాహుల్ కారులో పార్లమెంటుకు బయలుదేరుతుండగా దారిలో ఒక వ్యక్తి స్కూటర్‌పై నుంచి కిందపడిపోవడం గమనించారు. వెంటనే ఆయన కారు ఆపి, తన సహాయక సిబ్బందితో కలిసి హుటాహుటిన అక్కడికి వెళ్లారు. కింద పడిన వ్యక్తిని పైకి లేవదీశారు. ఆయన సిబ్బంది కూడా ఇందుకు సహకరించారు. ఏదైనా గాయాలు తగిలాయా అంటూ రాహుల్ ఆ వ్యక్తిని ప్రశ్నించారు. ఆ తర్వాత స్టూటరిస్టుకు షేక్‌హ్యాండ్ ఇచ్చిన అక్కడి నుంచి రాహుల్ ముందుకు కదిలారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'జన్ నాయక్' (ప్రజల హీరో) అంటూ దీనికి ఒక క్యాప్షన్ కూడా పెట్టింది. రాహుల్ పార్లమెంటులోకి అడుగుపెట్టి ప్రసంగించక ముందే జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది.