Rajasthan: రాజ్పుట్ కర్ణిసేన అధ్యక్షుడిపై కాల్పులు
ABN , First Publish Date - 2023-08-13T17:25:56+05:30 IST
రాజస్థాన్ శ్రీ రాజ్పుట్ కర్ణి సేన అధ్యక్షుడు భన్వర్ సింగ్ పై ఉదయ్‌పూర్‌లో ఆదివారం ఉదయం ఓ యువకుడు కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేపింది. భన్వర్ సింగ్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.
ఉదయ్‌పూర్: రాజస్థాన్ శ్రీ రాజ్పుట్ కర్ణి సేన (Shri Rajput Karni Sena) అధ్యక్షుడు భన్వర్ సింగ్ (Bhanwar Singh)పై ఉదయ్‌పూర్‌లో ఆదివారం ఉదయం ఓ యువకుడు కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేపింది. భన్వర్ సింగ్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆయనకు ప్రాణాపాయం తప్పినట్టు తెలుస్తోంది.
ఉదయ్‌పూర్‌లోని బీఎన్ సంస్థాన్‌లో సమావేశం జరుగుతుండగా రద్దీగా ఉన్న జనంలోంచి ఓ యువకుడు అకస్మాత్తుగా తుపాకీ బయటకు తీసి భన్వర్ సింగ్‌పై కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమైన అక్కడి జనాలు అతన్ని పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కర్ని సేన పోస్ట్ నుంచి తనను తొలగించడం తట్టుకోలేకనే ఆ యువకుడు కాల్పులకు దిగినట్టు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.