Share News

Rajasthan: కర్ణిసేన హంతకుల గుర్తింపు...సడలని ఉద్రిక్తతలు

ABN , First Publish Date - 2023-12-06T17:18:40+05:30 IST

రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ని సేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని దారుణంగా కాల్చిచంపిన ఇద్దరు షూటర్లను రాజస్థాన్ పోలీసులు గుర్తించారు. సుఖ్‌దేవ్ సింగ్‌ను ఆయన నివాసంలోనే అతిసమీపం నుంచి దుండగులు మంగళవారం కాల్పిచంపారు.

Rajasthan: కర్ణిసేన హంతకుల గుర్తింపు...సడలని ఉద్రిక్తతలు

జైపూర్: రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ని సేన (Rashtriya Rajput Karni Sena) చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి (Sukhdev Singh Gogamedi)ని దారుణంగా కాల్చిచంపిన ఇద్దరు షూటర్లను రాజస్థాన్ పోలీసులు గుర్తించారు. సుఖ్‌దేవ్ సింగ్‌ను ఆయన నివాసంలోనే అతిసమీపం నుంచి దుండగులు మంగళవారం కాల్పిచంపారు. సుఖ్‌దేవ్‌తో కలిసి కాఫీ తాగుతూ అకస్మాత్తుగా ఆయనపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సుఖ్‌దేవ్ సింగ్, ఆయన ఇద్దరు అనుచరులకు బుల్లెట్లు గాయాలు కాగా, ఆసుపత్రికి తరలిస్తుండగా సుఖ్‌దేవ్ మరణించారు. ఆయన ఇంట్లో జరిగిన గన్‌ఫైట్‌లో దాడికి పాల్పడిన వ్యక్తులలో ఒకరిని సుఖ్‌దేవ్ సింగ్ అనుచరులు కాల్చిచంపినట్టు కూడా పోలీసులు చెబుతున్నారు.


సుఖ్‌దేవ్ సింగ్ హత్యోదంతంపై రాజస్థాన్‌లో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్ణి సేన, ఇతర కమ్యూనిటీ సంస్థలు బంద్‌కు పిలుపునివ్వడంతో పరిస్థితి మరింత తీవ్రరూపు దాల్చింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల సమాచారం చెప్పిన వారికి రూ.5 లక్షల బహుమతి ప్రకటించారు. హత్యకేసుపై దర్యాప్తునకు డీజీపీ ఉమేష్ మిశ్రా ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT)ని ఏర్పాటు చేశారు.


రాష్ట్రవ్యాప్త బంద్‌ సందర్భంగా సుఖ్‌దేవ్ సింగ్ మద్దతుదారులు జైపూర్‌లో రోడ్లను దిగ్బంధించి నిందితులను అరెస్టు చేయాలంటూ ఆందోళనలకు దిగారు. చురు, ఉదయ్‌పూర్, ఆల్వార్, జోథ్‌పూర్ జిల్లాల్లో కూడా ఆందోళనలు చోటుచేసుకున్నాయి.


కాగా, సుఖ్‌దేవ్ సింగ్‌ను హత్య చేసింది తామేనంటూ గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్ గ్రూపులతో సన్నిహత సంబంధం ఉన్న రోహిత్ గోదారా అనే గ్యాంగ్‌స్టర్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో ప్రకటించడం మరింత సంచలనమైంది. గతంలోనూ రోహిత్ గోదారా సుఖ్‌దేవ్‌‌ను బెదిరించాడని, అతనిపై సుఖ్‌దేవ్ సింగ్ ఫిర్యాదు చేశాడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ బ్రార్‌ ఎన్ఐఏ వాటెండ్ క్రిమినల్‌గా ఉన్నాడు. పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కూడా అతను వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడు.

Updated Date - 2023-12-06T17:18:42+05:30 IST