ఖలిస్థానీ తీవ్రవాదాన్ని సహించం!

ABN , First Publish Date - 2023-09-07T01:37:22+05:30 IST

తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా బ్రిటన్‌లో అనుమతించబోమని ఆ దేశ ప్రధానమంత్రి రిషి సునక్‌ స్పష్టంచేశారు.

ఖలిస్థానీ తీవ్రవాదాన్ని సహించం!

మోదీ నాయకత్వంలో భారత్‌

ప్రపంచస్థాయికి ఎదిగింది

న్యూఢిల్లీ, సెప్టెంబరు 6: తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా బ్రిటన్‌లో అనుమతించబోమని ఆ దేశ ప్రధానమంత్రి రిషి సునక్‌ స్పష్టంచేశారు. చట్టబద్ధంగా నిరసన తెలిపే హక్కు హింసాత్మక ధోరణులకు, బెదిరింపు కార్యకలాపాలకు వర్తించబోదన్నారు. బ్రిటన్‌లో ఖలిస్థానీ అనుకూల సంస్థల కార్యకలాపాలు పెరగటంపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జీ-20 సమావేశాలకు సునక్‌ హాజరు కానున్న దృష్ట్యా పీటీఐ వార్తాసంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఖలిస్థానీ అనుకూల తీవ్రవాదాన్ని ఎదుర్కోవటానికి భారత్‌తో కలిసి సన్నిహితంగా పని చేస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా, జీ 20కి భారత్‌ సారథ్యంపై సునక్‌ హర్షం వ్యక్తం చేశారు. ‘భారత్‌ విస్తృతి, వైవిధ్యం, ఆ దేశం సాధించిన అసాధారణ విజయాలు.. జీ 20కి సరైన సమయంలో అధ్యక్షత వహించే సరైన దేశం భారతేనని స్పష్టం చేస్తున్నాయి. ప్రధాని మోదీ సారథ్యంలో భారత్‌ ప్రపంచస్థాయి నాయకత్వాన్ని చేపడుతోంది. జీ 20కి భారత్‌ నేతృత్వం వహిస్తున్న ప్రస్తుత సమయంలో వాతావరణ మార్పుల నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వరకు విభిన్న అంతర్జాతీయ సమస్యలపై కలిసి పని చేస్తాం’ అని సునక్‌ వెల్లడించారు.

Updated Date - 2023-09-07T01:38:21+05:30 IST