Sachin Pilot: సీఎంతో విభేదాలకు స్వస్తి... చల్లటి కబురు చెప్పిన పైలట్..

ABN , First Publish Date - 2023-07-08T18:56:06+05:30 IST

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో సమష్టి నాయకత్వంతో ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సూచించారని, ఆయన సూచన మేరకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో తలెత్తిన విభేదాలను పక్కనపెట్టాలని నిర్ణయించుకున్నానని ఆ పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ ) శనివారంనాడు పీటీఐకి ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.

Sachin Pilot: సీఎంతో విభేదాలకు స్వస్తి... చల్లటి కబురు చెప్పిన పైలట్..

న్యూఢిల్లీ: రాజస్థాన్ (Rajasthan) అసెంబ్లీ ఎన్నికల్లో సమష్టి నాయకత్వంతో ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) సూచించారని, ఆయన సూచన మేరకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌(Ashok Gehlot)తో తలెత్తిన విభేదాలను పక్కనపెట్టాలని నిర్ణయించుకున్నానని ఆ పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ (Sachin Pilot) శనివారంనాడు పీటీఐకి ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.


''జరిగినదేదో జరిగింది. వాటిని మరిచిపోదాం'' అని ఖర్గే తనకు సూచించారని పైలట్ చెప్పారు. అశోక్ గెహ్లాట్ తనకంటే పెద్దవారని, అనుభవజ్ఞులని, ఆయన భుజాలపై అనేక బాధ్యతలు కూడా ఉన్నాయని పైలట్ అన్నారు. తాను కూడా రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని కలుపుకుని వెళ్లేందుకు ప్రయత్నించానని, ఈరోజు ఆయన (గెహ్లాట్) ముఖ్యమంత్రిగా ఉన్నందున అందరినీ కలుపుకుని వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. అంశాల విషయంలో ఒక్కోసారి ముందువెనుకలనేవి ఉంటాయని, అది పెద్ద విషయం కాదని, వ్యక్తిగతం విషయాల కంటే పార్టీ, ప్రజలు ముఖ్యమని అన్నారు.


వసుంధరా రాజే ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై గెహ్లాట్‌ చర్యలు తీసుకోవడం లేదంటూ పైలట్ ఇటీవల ఆందోళనకు దిగారు. ఒకరోజు నిరాహార దీక్షతో పాటు, ఐదు రోజుల పాదయాత్ర కూడా చేపట్టారు. దీనిపై అడిగిన ప్రశ్నకు పైలట్ సమాధానమిస్తూ, గెహ్లాట్‌తో ఏర్పాటు చేసిన సమావేశంలో ఖర్గే ఒక మాట చెప్పారని, గడిచిన సమయం తిరిగి రాదని, భవిష్యత్తు దృక్కోణంతోనే అంతా ముందుకు వెళ్లాలని సూచించారని తెలిపారు. ఖర్గే చెప్పినట్టుగా క్షమాగుణం, మరిచిపోవడం, భవిష్యత్తుపై ఆశావహ దృక్పథంతో ముందుకు వెళ్లడం ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని, ఆ విషయాన్ని తాను కూడా బలంగా నమ్ముతానని, కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రజల ఆశీస్సులు అందరికీ అవసరమని, అందుకోసం కలిసికట్టుగా ముందుకు వెళ్లడం, ప్రజలు, పార్టీ కార్యకర్తల ఆభీష్టానికి అనుగుణంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు. జరిగినది తవ్వుకోవడం, ఎవరు ఏమన్నారు, ఎప్పుడేమన్నారనే విషయాలను చర్చించుకోవడం అనవసరమని తెలిపారు. ప్రజాజీవితంలో కానీ, రాజకీయాల్లో కానీ తాను మాట్లాడినా గౌరవప్రదంగా వ్యవహరిస్తారని, అలాంటి భాషనే వాడేందుకు ఇష్టపడతానని చెప్పారు.


గెలుపే మా మందున్న సవాల్..

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడమే తమముందున్న సవాల్ అని, గతం తవ్వుకోవడం కాదని పైలట్ స్పష్టం చేశారు. సమష్టి నాయకత్వంతో ఎన్నికలకు వెళ్తున్నారా అని అడిగినప్పుడు ''అదొక్కటే సరైన మార్గం'' అని పైలట్ సమాధానమిచ్చారు. పార్టీ గెలుపు తన వల్లే అవుతుందని ఎవరు చెప్పినా అది సరికాదని, సమష్టి కృషి పైనే ఫలితాలు ఉంటాయని చెప్పారు. నిర్ణయాల రూపకల్పనలో పార్టీ కార్యకర్తలను కూడా కలుపుకొని వెళ్లాలని రాహుల్ తరుచు చెబుతుంటారని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ వ్యతిరేకతపై ఆందోళనపై అడిగినప్పుడు, ప్రతి ప్రభుత్వానికి ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుందని, పూర్తికాని పనులు ఇందుకు కారణం కావచ్చని అన్నారు. అయితే, తమ పార్టీ, ప్రభుత్వం ఉద్దేశాలను ప్రజలు అర్ధం చేసుకుంటారనే నమ్మకం తనకు ఉందన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన ప్రతి పథకానికి ప్రజల్లో మంచి స్పందన వస్తోందని, ఈ పథకాలని అట్టడుగుకు వర్గాలకు చేరువ చేయాల్సిన బాధ్యత తమపై ఉంటుందన్నారు. ఎన్నికల్లో ఎలాంటి పాత్రను పోషించనున్నారని ప్రశ్నించగా, గతంలో కూడా తనకు ఏ బాధ్యత అప్పగించినా దానికి న్యాయం చేస్తూ వచ్చానని, పార్టీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తనకు సమ్మతమేనని పైలట్ సమాధానమిచ్చారు. సమష్టిగా ఎన్నికలను ఎదుర్కొని చరిత్ర సృష్టించబోతున్నామని, గతంలో వచ్చిన సీట్ల కంటే ఎక్కువ సీట్లను సాధించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


కాగా, గత గురువారంనాడు రాజస్థాన్ ఎన్నికల వ్యూహంపై ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం జరిగింది. ఇందులో ఖర్గే, రాహుల్ గాంధీ, రాజస్థాన్ ఏఐసీసీ ఇన్‌చార్జి గోవింద్ డోటస్ర, పైలట్, పలువురు రాష్ట్ర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పాదానికి తగిలిన గాయం కారణంగా అశోక్ గెహ్లాట్ నేరుగా కాకుండా వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Updated Date - 2023-07-08T18:56:06+05:30 IST