Satya Pal Malik: పీఎస్‌కు సత్యపాల్ మాలిక్.. అరెస్టు చేయలేదన్న పోలీసులు

ABN , First Publish Date - 2023-04-22T18:15:48+05:30 IST

జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ శనివారంనాడు ఢిల్లీలోని ఆర్‌కే పురం పోలీస్ స్టేషన్‌కు..

Satya Pal Malik: పీఎస్‌కు సత్యపాల్ మాలిక్.. అరెస్టు చేయలేదన్న పోలీసులు

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ (Satya Pal Malik) శనివారంనాడు ఢిల్లీలోని ఆర్‌కే పురం పోలీస్ స్టేషన్‌కు (RK Puram Police station) వెళ్లారు. సత్యపాల్ మాలిక్ జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌గా ఉన్నప్పుడు జరిగిన ఒక అవినీతి కేసులో సీబీఐ సమన్లు పంపిన మరుసటి రోజే ఆయన పీఎస్‌కు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఆయన ఐచ్ఛికంగానే పోలీస్ స్టేషన్‌కు వచ్చారని, తాము ఆయనను అరెస్టు చేయలేదని పోలీసులు ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. తన మద్దతుదారులతో కలిసి ఆయన స్టేషన్‌కు వచ్చినట్టు చెప్పారు.

విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం, సత్యపాల్ మాలిక్ ఇంటికి సమీపంలోని ఓ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి పోలీసులు అభ్యంతరం చెప్పడంతో ఆయన పీఎస్‌కు వెళ్లారు. అయితే రెసిడెన్షియల్ ఏరియాలో సమావేశం కావడంతో తాము అనుమతి ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్, హర్యానాకు చెందిన కొందరు రైతు నేతలు పార్క్ ఏరియాలో సమావేశానికి వచ్చారని తెలుస్తోంది. వారంతా మాలిక్‌కు మద్దతుగా నినాదాలు చేసుకుంటూ బస్సులో పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్టు సోషల్ మీడియాలో వచ్చిన వీడియోల్లో కనిపిస్తోంది. కాగా, ప్రస్తుతానికి తాము ఎలాంటి అరెస్టులు చేయడం లేదని పోలీసులు చెప్పడంతో తాను వెనుదిరిగినట్టు సత్యపాల్ మాలిక్ మీడియాకు తెలిపారు.

పరిణామ క్రమం...

రిలయెన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌లో అవినీతి ఆరోపణలపై సాక్ష్యం ఇచ్చేందుకు ఈనెల 28న తమ కార్యాలయానికి రావలంటూ సత్యపాల్ మాలిక్‌కు సీబీఐ శుక్రవారంనాడు నోటీసులిచ్చింది. పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టును 2018లో జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా ఉన్న సత్యపాల్ మాలిక్ రద్దు చేశారు. బీమా కేసులో అవినీతి చోటుచేసుకున్నట్టు మాలిక్ ఆరోపించారు. దీంతో సీబీఐ చర్యలకు దిగింది. అందులో భాగంగానే ఆయనకు నోటీసులు ఇచ్చింది.

Updated Date - 2023-04-22T18:15:48+05:30 IST