Tejasvi Surya: ఇండిగో ఎమర్జెన్సీ డోర్ వివాదం, సింధియా వివరణ
ABN , First Publish Date - 2023-01-18T18:42:31+05:30 IST
బీజేపీ నేత తేజస్వి సూర్య గత నెలలో ఇండిగో విమానంలో ప్రయాణిస్తూ అత్యవసర మార్గం తలుపులు తెరిచారన్న వివాదంపై ..
న్యూఢిల్లీ: బీజేపీ నేత తేజస్వి సూర్య (Tejasvi Surya) గత నెలలో ఇండిగో విమానం (Indigo plane)లో ప్రయాణిస్తూ అత్యవసర మార్గం తలుపులు (Emergency Exit Gate) తెరిచారన్న వివాదంపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) బుధవారంనాడు స్పందించారు. ఆ మాట నిజమేనని, అయితే పొరపాటున ఆయన ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేటు తెరిచారని, అందుకు విమానయాన సంస్థకు తేజస్వి సూర్య క్షమాపణ కూడా చెప్పారని తెలిపారు. తేజస్వి సూర్య నిర్వాకంపై ఇండిగో సంస్థ, బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ఆక్షేపిస్తూ విపక్షాలు దుమారం రేపడంతో కేంద్ర మంత్రి తాజా వివరణ ఇచ్చారు.
''ఈ ఘటనలో ప్రధానంగా వాస్తవాలను చూడాలి. పొరపాటునే ఎగ్జిట్ గేట్‌ను ఆయన (తేజస్వి సూర్య) తెరిచారు. ఘటన అనంతరం అన్ని తనిఖీలు జరిపిన తర్వాతే విమానం యథాప్రకారం బయలుదేరింది'' అని మీడియాతో మాట్లాడుతూ సింధియా తెలిపారు.
డిజీసీఏ ఏమి చెప్పింది?
చెన్నై-తిరుచిరాపల్లి ఇండిగో విమానంలో ఈ ఘటన జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మంగళవారంనాడు ప్రకటనలో తెలిపింది. అయితే, ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. పొరపాటునే ఈ ఘటన జరిగినట్టు పేర్కొంది. సేఫ్టీ ప్రొటాకాల్ విషయంలో ఎలాంటి రాజీలేదని కూడా తెలిపింది. అయితే, ఆ ప్రయాణికుడు తేజస్వీ సూర్యనే అంటూ కాంగ్రెస్ బయటపెట్టింది. సొంత పార్టీ నేతే ఈ ఉల్లంఘనకు పాల్పడ్డారని కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా తెలిపారు. టేకాఫ్‌కు ముందే ఈ ఘటన జరగడం వల్ల ప్రమాదం తప్పిందనీ, లేకుంటే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడేదని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు. సుమోటోగా ఈ ఘటనను ఎందుకు తీసుకోలేదని ఆమె ప్రశ్నించారు.