Tihar Jail: తీహార్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ..ఇద్దరికి గాయాలు
ABN , First Publish Date - 2023-05-29T19:42:44+05:30 IST
దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైలులో మరోసారి విచారణ ఖైదీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు గ్రూపుల మధ్య జరిగిన ఈ దాడిలో ఇద్దరు గాయపడినట్టు జైలు అధికారులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 12.40 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైలులో (Tihar Jail) మరోసారి విచారణ ఖైదీల మధ్య ఘర్షణ (Scuffle) చోటు చేసుకుంది. రెండు గ్రూపుల మధ్య జరిగిన ఈ దాడిలో ఇద్దరు గాయపడినట్టు జైలు అధికారులు తెలిపారు. అలోక్ అనే విచారణ ఖైదీ ఒక కత్తి, టైల్‌తో జరిపిన ఈ దాడిలో రాహుల్ అనే ఖైదీ గాయపడినట్టు చెప్పారు. సోమవారం మధ్యాహ్నం 12.40 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.
అధికారుల సమాచారం ప్రకారం, సెంట్రల్ జైల్ నెంబర్ వన్ (వార్డ్ నెంబర్ 2)లో కొందరు ఖైదీలు రాహుల్ అలియాస్ పవన్‌పై కత్తి, టైల్‌తో దాడి చేసి గాయపరిచారు. దాడికి దిగిన అలోక్ అలియాస్ విశాల్ కూడా గాయపడ్డాడు. జైలు సిబ్బంది, టీఎస్‌పీ, క్విక్ యాక్షన్ బృందాలు వెంటనే జోక్యం చేసుకుని రెండు వర్గాలను విడదీయడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ ఘర్షణలో గాయపడిన వారిని దీన్ దయాళ్ ఉపాధ్యాయ (డీడీయూ) ఆసుపత్రిలో చేర్చారు. హరినగర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
కాగా, ఈ ఘటనకు ముందు మే 2న తీహార్ జైలులో రెండు గ్రూపుల మధ్య ఇదేతరహా ఘటన చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ టిల్లు తేజ్‌పురియా హత్యకు గురయ్యాడు. ఈ ఘటన తీహార్ జైలులో భద్రతపై అనేక ప్రశ్నలకు మరోసారి తావిచ్చింది.