Seema Sisodia: రాజకీయాలను మురికితో పోల్చింది ఇందుకే... సిసోడియా భార్య భావోద్వేగ లేఖ
ABN , First Publish Date - 2023-06-07T20:49:48+05:30 IST
అడగడుగునా పోలీసు పహారా మధ్య తనను కలుసుకునేందుకు వచ్చిన భర్తను 103 రోజుల తర్వాత ఆమె కలుసుకున్నారు. ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. ఇంకెన్నాళ్లు తాము ఇలాంటి కుట్రలు ఎదుర్కోవాలో అంటూ వాపోయారు. మల్టిపుల్ స్క్లీరోసిస్ వ్యాధితో బాధపడుతున్న మనీష్ సిసోడియా భార్య సీమా సిసోడియా ఈ మేరకు ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు.
న్యూఢిల్లీ: అడగడుగునా పోలీసు పహారా మధ్య తనను కలుసుకునేందుకు వచ్చిన భర్తను 103 రోజుల తర్వాత ఆమె కలుసుకున్నారు. ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. నేను, నా భర్త, కుటుంబ సభ్యులు ఇంకెన్నాళ్లు ఇలాంటి కుట్రలు ఎదుర్కోవాలో అంటూ వాపోయారు. రాజకీయాలను అందుకే మురికితో పోల్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొంతకాలంగా మల్టిపుల్ స్క్లీరోసిస్ (multiple sclerosis) వ్యాధితో బాధపడుతున్న ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) భార్య సీమా సిసోడియా (Seema Sisodia) ఈ మేరకు ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు.
సీమా సిసోడియా తన నివాసంలోనే ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 103 రోజుల తర్వాత తన భర్తను కలుసుకున్నానంటూ ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. ఇంతకాలం తరువాత తాము కలుసుకుంటే మనీష్ కార్యక్రమాలపై నిఘా కోసం తమ బెడ్‌రూమ్ ప్రవేశద్వారం వద్ద పోలీసులు కాపలాగా ఉన్నారని, రాజకీయాలను మురికితో పోల్చింది అందుకేనని వాపోయారు.
రాజకీయాలకు దూరంగా ఉండమని చెప్పాం, కానీ...
రాజకీయాల్లోకి వెళ్లవద్దని తన బంధువులు, శ్రేయాభిలాషులు మనీష్‌కు సలహా ఇచ్చిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తుకు చేసుకున్నారు. రాజకీయాలపై మక్కువ ఉన్నప్పటికీ మనీష్ జర్నలిస్టు వృత్తిని ఎంచుకున్నారని, ప్రస్తుత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి పార్టీ ఏర్పాటు చేశారని అన్నారు.
''ఇవాళ, 103 రోజుల తర్వాత మనీష్‌ను కలుసుకునే అవకాశం దక్కింది. ఇంకా ఎన్ని రోజులు నేను, నా భర్త, నా కుటుంబం ఈ కుట్రలను ఎదుర్కోవాలో తెలియదు. రాజకీయాలు మురికిమయమని ప్రతి ఒక్కరూ అంటుంటారు. వాళ్లు ఏమి చేయాలనుకుంటారో అది చేసుకోవచ్చు.. కానీ చదువు (ఎడ్యుకేషన్) కోసం అరవింద్, మనీష్ కన్న కలలను మాత్రం కటకటాల వెనక్కి నెట్టలేరు. కచ్చితంగా పాలిటిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గెలిచి తీరుతుంది. మనీష్ నిన్ను చూసి గర్విస్తున్నా...లవ్ యూ'' అంటూ ఆ లేఖను సీమా సిసోడియా ముగించారు.
భార్యను కలుసుకునేందుకు కోర్టు షరతులు..
ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో గత మార్చిలో సిసోడియాను ఈడీ అరెస్టు చేయడంతో అప్పటి నుంచి ఆయన తీహార్ జైలులో ఉంటున్నారు. ఆయన బెయిలు దరఖాస్తు్ను కోర్టు పలుమార్లు తోసిపుచ్చింది. గత శుక్రవారంనాడు కూడా కోర్టు ఆయన బెయిల్ దరఖాస్తును తిరస్కరించింది. అయితే, అస్వస్ధతతో ఉన్న సీమ సిసోడియాను ఆయన కలుసుకునేందుకు కొన్ని షరతులతో అంగీకరించింది. పోలీసుల సమక్షంలో ఇంటి వద్ద కానీ, ఆసుపత్రిలో కానీ ఉదయం 10 గంటల నుండి 5 గంటల లోపు ఒకరోజు ఆమెను కలుసుకోవచ్చని, ఆ సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో మినహా ఎవరితో మాట్లాడరాదని, మీడియా ముందుకు వెళ్లరాదని, ఫోను, ఇంటర్నెట్‌ను ఉపయోగించరాదని షరతులు పెట్టింది. గత శనివారంనాడు సిసోడియాను పోలీసు అధికారులు ఆయన ఇంటికి తీసుకువెళ్లగా, దానికి కొద్ది సేపటికి ముందే ఆరోగ్యం విషమించడంతో సీమ సిసోడియాను ఆసుపత్రికి తరలించారు.