Atiq Ashraf Killers: చురుగ్గా సిట్ దర్యాప్తు... ఐదుగురిపై వేటు.. నిందితులకు నాలుగు రోజుల కస్టడీ

ABN , First Publish Date - 2023-04-19T15:35:09+05:30 IST

సిట్ అధికారులు అతీఖ్, అష్రఫ్‌ హత్యల రోజు భద్రత కల్పించిన పోలీసులందరినీ ప్రశ్నించారు.

Atiq Ashraf Killers: చురుగ్గా సిట్ దర్యాప్తు... ఐదుగురిపై వేటు.. నిందితులకు నాలుగు రోజుల కస్టడీ
Gangster brothers Atiq Ashraf murder case

లక్నో: ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) గ్యాంగ్‌స్టర్‌ అతీఖ్ అహ్మద్‌ (Atiq Ahmed) అతడి సోదరుడు అష్రఫ్‌ అహ్మద్‌ (Ashraf)‌‌ హత్యల నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌(Prayagraj) షాగంజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అశ్వనీ కుమార్ సింగ్‌ను సస్పెండ్ చేశారు. హత్యలపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటైన సిట్ అధికారులు అతీఖ్, అష్రఫ్‌ హత్యల రోజు భద్రత కల్పించిన పోలీసులందరినీ ప్రశ్నించారు. ‌స్టేషన్ హౌస్ ఆఫీసర్ అశ్వనీ కుమార్ సింగ్‌‌నూ విచారించారు. అనంతరం సిట్ తాత్కాలిక నివేదిక ఆధారంగా అశ్వనీ కుమార్ సింగ్‌ను, ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్‌లను, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.

మరోవైపు అతీక్‌ అహ్మద్‌, అతడి సోదరుడు అష్రాఫ్‌ అహ్మద్‌ను కాల్చి చంపిన లవ్లేశ్‌ తివారీ, సన్నీ సింగ్, అరుణ్‌ మౌర్యలను సీజేఎం కోర్ట్ పోలీస్ కస్టడీకి అప్పగించింది. ప్రస్తుతం వీరంతా 14రోజుల రిమాండ్‌లో ఉన్నారు. ఈ నెల 15న అతీక్‌ అహ్మద్‌, అతడి సోదరుడు అష్రాఫ్‌ అహ్మద్‌ను ప్రయాగ్‌రాజ్‌లోని కెల్విన్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షలకు తీసుకెళ్తుండగా.. లవ్లేశ్‌ తివారీ, సన్నీ సింగ్, అరుణ్‌ మౌర్య మెడలో మీడియా ఐడీ కార్డులు ధరించి, అక్కడకు చేరుకున్నారు. దుండగుల్లో ఒకడు అతీక్‌ కణతపై రివాల్వర్‌ను పెట్టి, ట్రిగ్గర్‌ నొక్కేశాడు. అతీక్‌ కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే దుండగులు అష్రాఫ్‌ వైపు వచ్చి.. అతణ్నీ కాల్చి చంపారు. అంతటితో ఆగకుండా.. కుప్పకూలిన ఆ ఇద్దరిపై కాల్పులను కొనసాగించారు. ప్రాథమిక దర్యాప్తులో ఆ ముగ్గురూ తమకు అతీక్‌తో ఉన్న పాతకక్షల వల్లే ఆ ఘాతుకానికి పాల్పడ్డట్లు అంగీకరించినట్లు తెలిసింది. అంతే కాదు ఈ హత్య ద్వారా మాఫియాలో తమకంటూ ఓ స్థానం సంపాదించుకోవడం కూడా లక్ష్యమని విచారణలో చెప్పినట్లు సమాచారం. ఇతర సమయాల్లో అతీక్‌ సామ్రాజ్యంలోకి ప్రవేశించడం కష్టమని, పోలీసులు వారిద్దరినీ జైలుకు తరలిస్తే మళ్లీ చాన్స్‌ దొరకదని చెప్పిట్లు సమాచారం. అందుకే మీడియా ముసుగులో అతీక్‌కు అతి సమీపానికి వచ్చాక.. ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

నిన్న అతీక్‌ అహ్మద్‌ న్యాయవాది దయాశంకర్ మిశ్రా (Daya Shankar Mishra) నివాసం సమీపంలో దుండగులు మూడు నాటు బాంబులు విసిరారు. తమను భయభ్రాంతులకు గురిచేసేందుకే దుండగులు బాంబులు విసిరారని ఆయన చెప్పారు. బాంబులు ఎవరు విసిరి ఉంటారనే విషయం పోలీసుల విచారణలో తేలుతుందన్నారు. అయితే బాంబులు విసరడం వెనుక కుట్ర దాగుందని ఆయన చెప్పారు. నాటు బాంబులు పేలడంతో ప్రయాగ్‌రాజ్‌లోని కట్రా ప్రాంతం ఉలిక్కిపడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించేపనిలో పడ్డారు.

అతీఖ్ అహ్మద్‌, అతడి సోదరుడు అష్రఫ్‌ అహ్మద్‌ (Ashraf)‌‌ హత్యల తర్వాత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) తొలిసారి స్పందించారు. యూపీలో ఇక మాఫియా పేరుతో ఎవ్వరినీ బెదిరించలేరని చెప్పారు. 2017కు ముందు రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా ఉండేవని, నిత్యం అల్ల్ర్లతో చెడ్డపేరు ఉండేదని యోగి గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక మాఫియా అంతుచూశామన్నారు. యూపీ ప్రగతి బాటలో నడుస్తోందన్నారు. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన కొనసాగుతుందన్నారు. లక్నోలో జరిగిన సమావేశంలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు అతీఖ్ అహ్మద్ భార్య షైస్తా పర్వీన్‌(Shaista Parveen) ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ఉధృతంగా గాలింపు జరుపుతున్నారు. అతీఖ్ ఇంటికి తాళం కూడా వేయకుండా ఇంట్లో ఉన్నవారంతా పరారయ్యారు. అతీఖ్, అష్రఫ్‌ల అంత్యక్రియలకు కూడా షైస్తా పర్వీన్‌ హాజరుకాకపోవడంతో ఆమె ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఆమె తలపై 50 వేల రూపాయల రివార్డ్ కూడా ఉంది. అతీఖ్ అహ్మద్ నేరసామ్రాజ్యాన్ని నడపడంలో షైస్తా పర్వీన్‌ కీలకంగా ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అతీఖ్ అహ్మద్ జైలులో ఉండగా మాఫియా సభ్యులతో అక్రమ వ్యవహారాలన్నీ ఆమెనే చక్కబెట్టారని పోలీసులు చెబుతున్నారు.

మరోవైపు ఫిబ్రవరి 24న న్యాయవాది ఉమేశ్ పాల్ హత్య సమయంలో బాంబులు విసిరిన గుడ్డూ ముస్లిం (Guddu Muslim) కోసం కూడా పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. తాజాగా అతడి కదలికలు కర్ణాటకలో బయటపడినట్లు సమాచారం. ఉమేశ్‌ పాల్‌పై అతీఖ్ తనయుడు అసద్, అతడి స్నేహితుడు గులాం కాల్పులు జరుపుతుండగా గుడ్డూ ముస్లిం నాటు బాంబులు విసిరాడు. నాటు బాంబులు అత్యంత వేగంగా తయారు చేయడంతో పాటు విసరడంలోనూ గుడ్డూ ముస్లిం నిపుణుడని, అతీఖ్ మాఫియా గ్యాంగ్‌లో ప్రస్తుతం కీలకంగా వ్యవహరిస్తున్నాడని పోలీసులకు సమాచారం ఉంది. దీంతో గుడ్డూ ముస్లిం ఆచూకీ బయటపడితే అతీఖ్‌ నేర సామ్రాజ్యానికి, పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకు, ఐఎస్ఐకి ఉన్న సంబంధాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు.

Updated Date - 2023-04-19T15:35:13+05:30 IST