Share News

Minister Ashwini Vaishnav : టెలికం చట్టానికి పదును!

ABN , Publish Date - Dec 19 , 2023 | 03:56 AM

బ్రిటిష్‌ కాలం నాటి ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ యాక్ట్‌కు కాలం చెల్లింది. సమాచార సాంకేతిక రంగం(ఐటీ) కొత్తపుంతలు తొక్కుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా చట్టాన్ని అమలు చేయడానికి కేంద్రం సిద్ధమైంది. అంతేకాదు.. టెలికం ఆపరేటర్ల ఒంటెద్దు

Minister Ashwini Vaishnav : టెలికం చట్టానికి పదును!

కేంద్రం నియంత్రణలోకి టెలికం ఆపరేటర్లు

అత్యవసర పరిస్థితుల్లో కేంద్రం చేతుల్లోకి సేవలు

లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 18: బ్రిటిష్‌ కాలం నాటి ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ యాక్ట్‌కు కాలం చెల్లింది. సమాచార సాంకేతిక రంగం(ఐటీ) కొత్తపుంతలు తొక్కుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా చట్టాన్ని అమలు చేయడానికి కేంద్రం సిద్ధమైంది. అంతేకాదు.. టెలికం ఆపరేటర్ల ఒంటెద్దు పోకడలకు కళ్లెం వేసేలా కొత్త చట్టం కేంద్రానికి అధికారాలను దఖలు పరుస్తుండగా.. వాటిపై నియంత్రణ విషయంలో ట్రాయ్‌ విచక్షణాధికారాలను పరిమితం చేయనుంది. ముఖ్యంగా.. ప్రజాభద్రత, దేశభద్రత కోణాల్లో.. మెసేజింగ్‌ యాప్‌లు, వాయిస్‌ ఓవర్‌ ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌(వీవోఐపీ) కాలింగ్‌ సేవలందించే అప్లికేషన్లను కూడా టెలికమ్యూనికేషన్‌ నిర్వచనం పరిధిలోకి తీసుకువచ్చింది. పలు కీలక మార్పులు చేర్పులతో రూపొందించిన టెలికమ్యూనికేషన్స్‌ ముసాయిదా బిల్లు-2023ని కేంద్ర సమాచార, ఐటీ మంత్రి అశ్వినీవైష్ణవ్‌ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ఆగస్టులోనే క్యాబినెట్‌ ఆమోదించింది. టెలికం బిల్లు చట్టరూపు దాలిస్తే.. టెలికమ్యూనికేషన్‌ ఆపరేటర్లు, సేవలపై కేంద్రానికి విశేష అధికారాలు దఖలుపడతాయి. అయితే.. ప్రజాభద్రత, దేశభద్రత, అత్యవసర పరిస్థితులు, విపత్తు సమయాల్లో మాత్రమే కేంద్రం ఆ అధికారాలను వినియోగిస్తుంది. అప్పుడు గంపగుత్తగా కేంద్ర టెలికాం సేవలపై ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. స్పెక్ట్రంను సద్వినియోగం చేసుకునేలా కేంద్రం ఆయా సేవలను దఖలుపర్చుకోవచ్చు. ఇక శాటిలైట్‌ ఆధారిత టెలికం సేవలను, శాటిలైట్‌ ఫోన్లను కూడా టెలికమ్యూనికేషన్‌ నిర్వచనం పరిధిలోకి తీసుకువస్తారు. అంటే.. శాటిలైట్‌ ఆధారిత కమ్యూనికేషన్‌పైనా కేంద్రానికి నియంత్రణ దఖలుపడుతుంది.

ఇకపై ఆ చర్యలు తీవ్ర నేరాలు..

ప్రభుత్వాలు దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఫోన్‌ ట్యాపింగ్‌ చేయడం తెలిసిందే..! కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనుమతి లేనిదే ఇతరుల ఫోన్లను దర్యాప్తు సంస్థలు ట్యాప్‌ చేయడానికి వీల్లేదు. కానీ, టెక్నాలజీ పెరిగినకొద్దీ.. హ్యాకింగ్‌, మాల్‌వేర్‌ల సాయంతో సామాన్యులకు కూడా సెల్‌ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఐటీ చట్టం పరిధిలో ఇది నేరంగా ఉంది. ఇకపై టెలికమ్యూనికేషన్‌ చట్టం దీన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తుంది. ఈ నేరం రుజువైతే మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.2 కోట్ల వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు. అదేవిధంగా.. అనధికారికంగా, ఇతరుల వివరాలను అందజేసి టెలిఫోన్‌/సెల్‌ఫోన్‌ కనెక్షన్‌ తీసుకున్నా గరిష్ఠంగా మూడేళ్ల వరకు జైలు, రూ.50 లక్షల దాకా జరిమానా లేదా రెండూ విధించవచ్చు.

ఆ యాప్‌లు కూడా టెలికం పరిధిలోకి..

ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ యాక్ట్‌ ప్రకారం మెసేజీలు, వీవోఐపీ సేవలను అందించే యాప్‌లు ఐటీ చట్టం పరిధిలో ఉండేవి. టెలికమ్యూనికేషన్స్‌ కొత్త చట్టం ప్రకారం ఈ తరహా యాప్‌లు, శాటిలైట్‌ మొబైల్‌ సర్వీసులు, ఓవర్‌-ద-టాప్‌ యాప్‌లు, వాట్సాప్‌, టెలిగ్రామ్‌, గూగుల్‌మీట్‌ వంటి యాప్‌లు కూడా టెలికమ్యూనికేషన్స్‌ నిర్వచనం పరిధిలోకి వస్తాయి. వాటిపైనా కేంద్ర ప్రభుత్వానికి నియంత్రణ ఉంటుంది.

గుర్తింపు పొందిన జర్నలిస్టులకు సాంత్వన

కొత్త చట్టంలో గుర్తింపు పొందిన(అక్రెడిటేడెడ్‌) జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వం సాంత్వన కలిగించింది. ప్రచురణ, ప్రసారాల కోసం జర్నలిస్టులు పంపే సందేశాలపై నిఘా ఉండకూడదని కొత్త చట్టం స్పష్టం చేస్తోంది. ఉదాహరణకు కొన్ని పదాల(బాంబ్‌, డ్రగ్స్‌ లాంటివి)పై నిఘా విభాగాల ప్రత్యేక దృష్టి ఉంటుంది. ఇలాంటి పదాలను ఎవరైనా పంపితే.. వెంటనే నిఘా విభాగాలు అలెర్ట్‌ అవుతాయి. అయితే.. గుర్తింపు పొందిన జర్నలిస్టులు వృత్తిలో భాగంగా తమ సందేశాల్లో ఇలాంటి పదాలు వాడితే వారిపై నిఘా పెట్టాల్సిన అవసరం లేదని కొత్త చట్టం స్పష్టం చేస్తోంది.

Updated Date - Dec 19 , 2023 | 03:56 AM