Shraddha Walkar Murder: అఫ్తాబ్‌పై హత్య, సాక్ష్యాల విధ్వంసం అభియోగాల నమోదు
ABN , First Publish Date - 2023-05-09T13:15:52+05:30 IST
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ హత్య కేసులో నిందితుడైన అఫ్తాబ్ అమిన్ పూనావాలాపై అభియోగాలను ఢిల్లీ సాకేత్ కోర్టు మంగళవారంనాడు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్ 302 (హత్య), 201 (సాక్ష్యాలను మాయం చేయడం) కింద అతనిపై అభియోగాలు నమోదయ్యాయి.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ హత్య కేసులో (Shraddha Walkar Murder) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ హత్య కేసులో నిందితుడైన అఫ్తాబ్ అమిన్ పూనావాలా (Aftab Amin Poonawalla)పై అభియోగాలను ఢిల్లీ సాకేత్ కోర్టు మంగళవారంనాడు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్ 302 (హత్య), 201 (సాక్ష్యాలను మాయం చేయడం) కింద అతనిపై అభియోగాలు నమోదయ్యాయి. గత ఏడాది మే 18న తన లివ్-ఇన్-పార్టనర్ శ్రద్ధావాకర్‌ను అఫ్తాబ్ గొంతునులిమి చంపాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని అత్యంత పాశవికంగా ముక్కలు ముక్కలుగా నరికి, సౌత్ ఢిల్లీ మెమ్రౌలిలోని తన నివాసంలో మూడు వారాల పాటు వాటిని ఫ్రిజ్‌లో దాచిపెట్టారు. పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు ఆ ముక్కలను దేశరాజధానిలోని వేర్వేరు ప్రాంతాల్లో విసిరేసినట్టు పోలీసులు తెలిపారు.
శ్రద్ధావాకర్ హత్య కేసులో వాదోపదాలను విన్న సాకేత్ కోర్టు, అఫ్తాబ్ ఈ హత్య చేసి, సాక్ష్యాలను విధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడనేందుకు తగిన ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ''దోషిగా ఒప్పుకోవాలుకుంటున్నావా? విచారణను కోరుకుంటున్నావా?" అని కోర్టు అఫ్తాబ్‌ను ప్రశ్నించగా, విచారణనే ఎదుర్కొంటానని అతను సమాధానమిచ్చాడు. దీంతో కేసు తదుపరి విచారణను జూన్ 1వ తేదీకి సాకేత్ కోర్టు వాయిదా వేసింది. శ్రద్ధావాకర్ హత్య కేసులో జనవరి 24న ఢిల్లీ పోలీసులు 6,629 పేజీల ఛార్జిషీటును దాఖలు చేశారు.