Special parliament Session: కొత్త పార్లమెంటు భవనంలో తొలి సెషన్... కొత్త డ్రెస్ కోడ్
ABN , First Publish Date - 2023-09-12T15:21:02+05:30 IST
అత్యాధునిక హంగులతో నిర్మించిన కొత్త పార్లమెంటు భవనంలో తొలి సమావేశాలు వచ్చే వారంలో ప్రారంభం కానున్నాయి. ఈ అమృతకాల్‌లో కొత్త అంశం కూడా చోటుచేసుకోనుంది. లోక్‌సభ, రాజ్యసభ సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలులోకి రానుంది.
న్యూఢిల్లీ: అత్యాధునిక హంగులతో నిర్మించిన కొత్త పార్లమెంటు భవనం (New Parliament)లో తొలి సమావేశాలు వచ్చే వారంలో ప్రారంభం కానున్నాయి. ఈ అమృతకాల్‌లో కొత్త అంశం కూడా చోటుచేసుకోనుంది. లోక్‌సభ, రాజ్యసభ సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్(New Dress code) అమలులోకి రానుంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకూ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లోద్ జోషి గత ఆగస్టు 31న ప్రకటించారు. 2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొన్ని కీలకమైన బిల్లులను ఈ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెడతారని చెబుతున్నారు. అయితే, ప్రత్యేక సమావేశాల ఎజెండా ఏమిటనే దానిపై అధికారిక సమాచారం మాత్రం లేదు.
అమృత్‌కాల్‌లో 'కొత్త డ్రస్ కోడ్'
లోక్‌సభ, రాజ్యసభ సిబ్బందికి ఇంతవరకూ అమలు చేస్తు్న్న డ్రెస్‌కోడ్ స్థానే కొత్త డ్రెస్ కోడ్‌ను ఈ సమావేశాల్లో అమల్లోకి తీసుకువస్తున్నారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా 'ఇండియన్ టచ్'తో ఈ డ్రస్ కోడ్ ఉండబోతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఉద్యోగుల యూనిఫాంగా రౌండ్ నెక్ ఉన్న చొక్కాలు, ఖాకీ కలర్ ప్యాంటులు ఉండబోతున్నాయి. మణిపూర్ టోపీ, షర్ట్‌పై ధరించేందుకు స్వీల్‌లెస్ జాకెట్లు ఉంటాయి. ఈ కాస్యూమ్‌లను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ డిజైన్ చేసింది.
మార్షల్స్ కోసం సఫారీ సూట్‌లకు బదులుగా క్రీమ్ కలర్ కుర్తా, ఫైజమాలు రెడీ చేశారు. పార్లమెంటరీ డ్యూటీ గ్రూప్‌కు కూడా కొత్త డ్రెస్ కోడ్ తీసుకువచ్చే వీలుందని తెలుస్తోంది. మహిళా ఉద్యోగుల కోసం కొత్త డిజైన్ చీరలు సిద్ధం చేశారు.
రెండోరోజు సమావేశం కొత్త పార్లమెంటులో...
అధికారిక వర్గాల సమాచారం మేరకు, పార్లమెంటు పాత భవనంలోనే తొలిరోజు సమావేశాలు జరిపి, మరుసటి రోజు కొత్త పార్లమెంటులోకి షిఫ్ట్ చేస్తారు. వినాయక చతుర్ధి కూడా ఆరోజే కావడంతో ఆ శుభసమాయాన్ని ఎంచుకున్నట్టు చెబుతున్నారు. ఐదురోజుల పార్లమెంటు సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం, ప్రైవేటు మెంబర్స్ బిజినెస్ వంటివి ఉండవు.