Supervision of IIMs: ఐఐఎంల పర్యవేక్షణ అధికారం రాష్ట్రపతికి
ABN , First Publish Date - 2023-08-05T02:54:11+05:30 IST
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎంలు)ల పర్యవేక్షణ అధికారం రాష్ట్రపతికి కల్పిస్తూ రూపొందించిన బిల్లును లోక్‌సభ శుక్రవారం ఆమోదించింది.
లోక్‌సభలో బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ, ఆగస్టు 4: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎంలు)ల పర్యవేక్షణ అధికారం రాష్ట్రపతికి కల్పిస్తూ రూపొందించిన బిల్లును లోక్‌సభ శుక్రవారం ఆమోదించింది. దీంతో వాటి నిర్వహణను పర్యవేక్షించే అధికారం, డైరెక్టర్ల తొలగింపు, సెలక్షన్ కమిటీలో సభ్యులను నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఈ బిల్లును ప్రవేశపెడుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. ఐఐఎంల అకడమిక్ అకౌంటబిలిటీని వాటి నుంచి లాక్కునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. కేవలం వాటి నిర్వహణ మెరుగ్గా ఉండాలన్నదే బిల్లు ఉద్దేశమని పేర్కొన్నారు. కేంద్రం వాటి ఏర్పాటుకు రూ. 6000 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఇప్పటికే ఐఐటీలు, ఎన్‌ఐటీలకు రాష్ట్రపతి విజిటర్‌గా ఉన్నారని తెలిపారు. అయినా వాటి స్వతంత్రపై ఎటువంటి ప్రశ్నలు తలెత్తలేదన్నారు. జూలై 28న లోకసభలో ప్రవేశ పెట్టిన ఈ బిల్లును మణిపూర్‌లో నెలకొన్న హింస విషయమై ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్య శుక్రవారం ఆమోదించారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 50 వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తామని కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్.కె. సింగ్ వెల్లడించారు. ఇప్పటి వరకూ 90 శాతానికి పైగా బ్రాడ్ గేజ్ విద్యుదీకరణ పూర్తయిందని, ఈ సంవత్సరంలోనే వంద శాతం విద్యుదీకరణను సాధిస్తామన్నారు.