Article 142: విడాకులపై సుప్రీం కోర్టు కీలక తీర్పు.. విడాకులు ఇక మరింత సులభతరం..!

ABN , First Publish Date - 2023-05-01T11:57:21+05:30 IST

2023, ‘మే’ డేన (May Day) కీలక తీర్పు వెల్లడైంది. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు విడాకుల (Supreme Court On Divorce) మంజూరుపై..

Article 142: విడాకులపై సుప్రీం కోర్టు కీలక తీర్పు.. విడాకులు ఇక మరింత సులభతరం..!

న్యూఢిల్లీ: 2023, ‘మే’ డేన (May Day) కీలక తీర్పు వెల్లడైంది. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు విడాకుల (Supreme Court On Divorce) మంజూరుపై కీలక తీర్పు వెలువరించింది. విడాకుల ప్రక్రియను ధర్మాసనం మరింత సులభతరం చేసింది. విడాకుల కోసం 6 నెలలు వేచి చూడాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. దంపతులు కోరుకుంటే వెంటనే విడాకుల మంజూరు చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

వివాహ బంధం మెరుగుపర్చుకోవడానికి అవకాశం లేని కేసుల్లో వెంటనే విడాకులు మంజూరు చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఆర్టికల్ 142 (Article 142) ప్రకారం ప్రత్యేక అధికారాలను ఉపయోగించి సుప్రీం ఈ తీర్పు వెల్లడించడం గమనార్హం. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. ఈ బెంచ్‌లో జస్టిస్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, అభయ్ ఎస్. ఓకా, విక్రమ్ నాథ్, జేకే మహేశ్వరి సభ్యులుగా ఉన్నారు.

విడాకులకు దరఖాస్తు చేసుకున్న జంటలకు ఆరు నెలల వ్యవధి ఎందుకిస్తారంటే..

హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం.. వైవాహిక బంధంలో తలెత్తిన మనస్పర్థల వల్ల విడాకులకు దరఖాస్తు చేసుకున్న జంటలకు ఆరు నెలల గడువు ఇస్తారు. ఈ ఆరు నెలల్లో భార్యాభర్తలిద్దరూ మనసు మార్చుకుని విడాకులపై వెనక్కి తగ్గితే వారి వైవాహిక బంధం నిలబడుతుందనే సదుద్దేశంతో ఈ ఆరు నెలల సమయాన్ని జంటలకు ఇవ్వడం జరుగుతుంది. ఆరు నెలల తర్వాత కూడా సదరు జంట విడాకులు తీసుకునేందుకే మొగ్గుచూపితే న్యాయస్థానం ఆ జంటకు విడాకులు మంజూరు చేస్తుంది.

విడాకులు పెరిగిపోవడానికి కారణాలేంటంటే..

భారతీయ సంస్కృతిలో వివాహం ఒక కట్టుబాటు. ఆడ, మగ అనే ఇద్దరిని ఏకం చేయడం దీని లక్ష్యం. దీని ద్వారా వ్యక్తులు, కుటుంబాలు మంచి మార్గంలో వెళితే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుంది. వివాహాన్ని తంతుగా కాకుండా ఒక వ్యవస్థగా తీర్చిదిద్దారు. వివాహ వ్యవస్థ పది కాలాలపాటు పదిలంగా ఉండటానికి వీలుగా దీనికంటూ కొన్ని ధర్మాలను నిర్ధేశించారు. దురదృష్టవశాత్తు ఈ వ్యవస్థ గొప్పదనం, దాని అవసరం, దీని ధర్మం నేటి యువతకు తెలియడం లేదు. ఇప్పుడు వివాహం ఒక వ్యవస్థగా.. అంతే బలంగా ఉన్నదా ? అంటే కచ్చితంగా చెప్పలేం. పరిస్థితులు, వ్యక్తులు, వారి మనస్తత్వాలు, ఆర్థిక స్థితిగతులకు ఇచ్చే ప్రాధమ్యాలు మారిపోయాయి.

సామాజిక బాధ్యత కంటే వ్యక్తి స్వేచ్ఛకు పెరిగిన ప్రాధాన్యత అనేక విడాకులకు కారణమవుతున్నాయి. ఒకరితో మరొకరు సర్దుకోలేకపోవడం, అలాంటి విషయాలపై అవగాహన కలిగించే పెద్దలు వారి దరిదాపుల్లో కనిపించకపోవడం, ఉపాధి వ్యవస్థల్లో వచ్చిన మార్పులు, రాజీ పడటం ఒక అసమర్థత అని నమ్మే స్థితి ఏర్పడడం భార్యాభర్తల మధ్య ఏర్పడుతున్న అగాథాలకు కారణాలు. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ భార్యాభర్తలు సర్దుబాటు ధోరణితో ముందుకు వెళ్లాలి.

Updated Date - 2023-05-01T12:42:30+05:30 IST